Deepika Padukone: 'కల్కి 2' నుంచి దీపికా తొలగింపు అందుకేనంట.. బయటకు వస్తున్న అసలు నిజాలు!

Deepika Padukone: 'కల్కి 2' నుంచి దీపికా తొలగింపు అందుకేనంట.. బయటకు వస్తున్న అసలు నిజాలు!

రెబల్ స్టార్ నటించిన ' కల్కి 2898  AD' చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డులు తెలిసిందే. ఇప్పుడు  దీనికి సీక్వెల్ గా ' కల్కి 2' ను మేకర్స్ సిద్ధం అవుతున్నారు. అయితే ఈ మూవీ నుంచి హీరోయిన్ దీపికా పదుకొనేని తొలగించడం సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. వ్యూహాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కేవలం డేట్స్ సమస్యలే కాదు.. భారీగా రెన్యుమరేషన్ పెంచాలని దీపికా డిమాండ్ చేయడమే దీనికి ప్రధాన కారణమని టాక్ వినిపిస్తోంది.

దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకో..

' కల్కి 2898  AD'  లో  దీపిక  పాత్రకు ప్రశంసలు లభించాయి. సీక్వెల్ లో కూడా తన పాత్ర ఎంత శక్తివంతంగా ఉంటుందో ఆమెకు బాగా తెలుసు.  అంతే కాదు మొదటి భాగం షూటింగ్ సమయంలోనే ఆమె రెండవ భాగం కోసం దాదాపు 20 రోజులు చిత్రీకరించారు.  గతంలో దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా రెండవ భాగంతో దీపిక పాత్ర మరింత ఎక్కువగా ఉంటుందని పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. దీంతో "దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకో" అనే సామెతను ఫాలో అయింది దీపిక. తన పారితోషికాన్ని భారీగా పెంచాలని డిమాండ్ చేసింది. మూవీ మేకర్స్ తో  ఆమె జరిపిన చర్చ తీరువల్లే అసలు సమస్య స్టార్ అయింది. చివరకు ఈ చిత్రం సిక్వెల్ నుంచి తప్పించాల్సి వచ్చింది. 

దీపిక గొంతెమ్మ కోరికలు

వాస్తవంగా దీపిక తదుపరి షెడ్యూల్స్ పరస్పర అంగీకారంతోనే నిర్ణయించారు మూవీ మేకర్స్. కాబట్టి డేట్స్ క్లాష్ కారణంగానే ఆమె వైదొలిగార్న వాదనలలో నిజం లేదని సినీ వర్గాలు తెలిపాయి.  దీపిక గొంతెమ్మ కోరికలు తీర్చలేక  ఆమెను పక్కన పెట్టినట్లు సమాచారం. వాస్తవ రెమ్యునరేషన్ కంటే 25 శాతం ఎక్కువ పారితోషికాన్ని ఆమె డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఆమె ప్రతి రోజు కేవలం 7 గంటలు మాత్రమే షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొంటానని పట్టుబట్టింది.  తన 25 మంది సిబ్బంది కోసం 5-స్టార్ హోటల్స్ కావాలని కూడా ఆమె డిమాండ్ చేసిందనన్న టాక్ వినిపిపిస్తోంది. 

వైజయంతీ మూవీస్ సీరియస్

ఈ పరిణామాల నేపథ్యంలో వైజయంతీ మూవీస్ తమ అధికారిక X ఖాతాలో ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. అందులో, “దీపికా పదుకొనే మా రాబోయే #కల్కి2898AD సీక్వెల్‌లో భాగం కాదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, మేము ఆమెతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మొదటి భాగం కోసం సుదీర్ఘంగా ప్రయాణించినప్పటికీ, మా మధ్య సహకారాన్ని కొనసాగించలేకపోయాం. #కల్కి2898AD లాంటి సినిమాకు పూర్తి నిబద్ధత అవసరం. భవిష్యత్ ప్రాజెక్టులకు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం” అని పేర్కొంది. అటు 'కల్కి' వివాదంపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సైతం పరోక్షంగా స్పందించారు. "జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ, తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు" అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

 నాగ్‌ అశ్విన్‌ కు దీపికా కౌంటర్ 

 ఈ ప్రకటన తర్వాత వారికి కౌంటర్ ఇచ్చేలా దీపిక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.  తను షారుఖ్‌ ఖాన్‌తో కలిసి నటిస్తున్నట్లు కొత్త సినిమా'కింగ్' ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధ్రువీకరించారు. "18 ఏళ్ల క్రితం 'ఓం శాంతి ఓం' సినిమా షూటింగ్‌లో షారుఖ్‌ నాకు నేర్పిన మొదటి పాఠం ఏమిటంటే, ఒక సినిమాను తయారు చేసే అనుభవం, ఆ సినిమాను ఎవరితో కలిసి చేస్తామన్నది దాని విజయం కంటే చాలా ముఖ్యమైనది" అని దీపికా పేర్కొన్నారు. అంతేకాకుండా, "నేను ఈ పాఠాన్ని అంగీకరిస్తూ, అప్పటి నుండి నేను తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఇదే సూత్రం ఆధారంగా ఉంది. అందుకేనేమో మేము కలిసి మా ఆరవ సినిమాను చేస్తున్నాం" అని ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్ట్, 'కల్కి' నిర్మాణ సంస్థకు, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు దీపికా పదుకొణె ఇచ్చిన పరోక్ష కౌంటర్‌ అని నెటిజన్లు భావిస్తున్నారు. 

ఈ పరిణామాలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మరోవైపు కల్కిలో తదుపరి హీరోయిన్ ఎవరు అని అభిమానుల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ప్రభాస్ సరసన అనుష్క మళ్లీ నటిస్తే సినిమాకు మరింత హైప్ ను తీసుకోస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి మూవీ మేకర్స్  ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.