Deepti Sharma: టీ20ల్లో దీప్తి శర్మ సరికొత్త చరిత్ర.. అల్‌టైం రికార్డ్ నెలకొల్పిన టీమిండియా ఆల్ రౌండర్

Deepti Sharma: టీ20ల్లో దీప్తి శర్మ సరికొత్త చరిత్ర.. అల్‌టైం రికార్డ్ నెలకొల్పిన టీమిండియా ఆల్ రౌండర్

టీమిండియా మహిళా ఆల్ రౌండర్ దీప్తి శర్మ బుధవారం (జూలై 9) అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించింది. ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్ మహిళలతో జరిగిన నాలుగో టీ20లో సోఫియా డంక్లీ వికెట్ తీసి పొట్టి ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు  తీసిన స్పిన్నర్ గా నిలిచింది. ఈ మ్యాచ్ కు ముందు 144 వికెట్లతో నిదా దార్ తో సంయుక్తంగా ఉన్న దీప్తి శర్మ.. ఇంగ్లాండ్ పై వికెట్ పడగొట్టి 145 వికెట్లతో టాప్ కు చేరుకుంది. 128 ఇన్నింగ్స్ ల్లోనే దీప్తి ఈ ఘనత అందుకోవడం విశేషం.సోఫీ ఎక్లెస్టోన్ (100 మ్యాచ్‌ల్లో 139 వికెట్లు), నట్టయ బూచతం (102 మ్యాచ్‌ల్లో 126 వికెట్లు), అనిసా మహ్మద్ (117 మ్యాచ్‌ల్లో 125 వికెట్లు) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.  

మహిళా క్రికెట్‌లో 300 కంటే ఎక్కువ అంతర్జాతీయ వికెట్లు తీసిన ఆరో ప్లేయర్ గా దీప్తి శర్మ నిలిచింది. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి 355 వికెట్లతో అగ్ర స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ పై భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప ఛేజింగ్ లో ఇండియా 17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి గెలిచింది. భారత్ ఈ మ్యాచ్ తో పాటు సిరీస్ కూడా గెలుచుకుంది. రాధా యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.  

మహిళా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్లు:

1 - దీప్తి శర్మ: 128 మ్యాచ్‌ల్లో 145 వికెట్లు

2 - నిదా దార్: 160 మ్యాచ్‌ల్లో 144 వికెట్లు

3 - సోఫీ ఎక్లెస్టోన్: 100 మ్యాచ్‌ల్లో 139 వికెట్లు

4 - నట్టయ బూచతం: 102 మ్యాచ్‌ల్లో 126 వికెట్లు

5 - అనిసా మహ్మద్: 117 మ్యాచ్‌ల్లో 125 వికెట్లు

మహిళా క్రికెట్‌లో 300 కంటే ఎక్కువ అంతర్జాతీయ వికెట్లు తీసిన ప్లేయర్లు: 

355 - ఝులన్ గోస్వామి

335 - కేథరీన్ స్కైవర్-బ్రంట్

331 - ఎల్లీస్ పెల్లీ

317 - షబ్నిమ్ ఇస్మాయిల్

305 - అనిసా మొహమ్మద్

301 - దీప్తి శర్మ          

►ALSO READ | IND vs ENG 2025: ఇంగ్లాండ్‌పై టాస్ ఓడిన టీమిండియా.. ప్రసిద్ స్థానంలో బుమ్రా