
దుబాయ్: ఇండియా విమెన్స్ జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ.. ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో నిలిచింది. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో దీప్తి (651) రెండు ప్లేస్‌లు ఎగబాకింది. ఆసీస్‌తో సిరీస్‌లో రెండు వికెట్లు తీయడం ఆమె ర్యాంక్ మెరుగుపడటానికి దోహదపడింది. స్నేహ్ రాణా (537) 16వ ర్యాంక్‌లో మార్పులేదు. రేణుకా సింగ్ ఠాకూర్ (495) 25వ ర్యాంక్‌లో ఉండగా, క్రాంతి గౌడ్ 23 స్థానాలు మెరుగుపడి 39వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక బ్యాటింగ్ విభాగంలో స్మృతి మంధాన (818) టాప్ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది.
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు సెంచరీలు చేయడంతో స్మృతి హయ్యెస్ట్ ర్యాంకింగ్ పాయింట్లను సొంతం చేసుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (630) రెండు స్థానాలు కిందకు దిగి 14వ ర్యాంక్‌లో ఉండగా, దీప్తి శర్మ (607) ఆరు స్థానాలు మెరుగుపడి 18వ ర్యాంక్‌లో నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్ (598) 20వ ర్యాంక్‌లో ఉంది. సివర్ బ్రంట్ (731), బెత్ మూనీ (727), లారా వోల్‌వర్ట్ (715), ఎలీస్ పెర్రీ (700) టాప్–5లో ఉన్నారు.