
న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై దాఖలైన పరువు నష్టం పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర నేత కాసం వెంకటేశ్వర్లు గతేడాది ట్రయల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్ రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, ఆగస్టు 1న ట్రయల్ కోర్టు ఆదేశాలను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.