- విశాఖలో ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- సముద్ర గర్భంలో శత్రువులకు ఇది సింహస్వప్నం
- శత్రువుల రాడార్లకు చిక్కకుండా ‘స్లీకర్ డిజైన్’
- ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ సహాయక చర్యలు
ఇండియన్ నేవీ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. అధునాతన స్టీల్త్ ఫ్రిగేట్ ‘ఐఎన్ఎస్ తారాగిరి’ జలప్రవేశం చేసింది. శుక్రవారం ఏపీలోని విశాఖలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ యుద్ధనౌకను ప్రారంభించారు. శత్రువుల రాడార్లకు చిక్కకుండా దీనిని ‘స్లీకర్ డిజైన్’తో రూపొందించారు.
విశాఖపట్నం: ఇండియన్ నేవీ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను మరింత పెంచుతూ, అధునాతన స్టీల్త్ ఫ్రిగేట్ ‘ఐఎన్ఎస్ తారాగిరి’ జలప్రవేశం చేసింది. శుక్రవారం ఏపీలోని విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ యుద్ధనౌకను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. భారత నౌకాదళానికి చెందిన ‘ప్రాజెక్ట్ 17ఏ’ లో భాగంగా నిర్మించిన నాలుగో శక్తివంతమైన నౌక ఇది. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- ‘మేక్ ఇన్ ఇండియా’కు నిలువుటద్దం
ముంబైలోని మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) నిర్మించిన ఈ యుద్ధనౌక, భారత స్వయంసమృద్ధికి (ఆత్మనిర్భర భారత్) నిదర్శనంగా నిలుస్తున్నది. దీని బరువు సుమారు 6,670 టన్నులు. ఇందులో ఉపయోగించిన పరికరాలు, సాంకేతికతలో 75 శాతానికి పైగా స్వదేశీయమే. ఈ నౌక నిర్మాణంలో దేశవ్యాప్తంగా ఉన్న 200కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలో) భాగస్వామ్యమయ్యాయి.
ఐఎన్ఎస్ తారగిరి కేవలం ఒక నౌక మాత్రమే కాదు, సముద్ర గర్భంలో శత్రువులకు సింహస్వప్నం లాంటిది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఉండేలా దీనిని ‘స్లీకర్ డిజైన్’తో రూపొందించారు. సముద్ర జలాల్లో గంటకు 28 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. సూపర్ సోనిక్ ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, మధ్య శ్రేణి గగనతల క్షిపణులు, అత్యాధునిక యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ సిస్టమ్‌లను ఇది కలిగి ఉంది.
యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ వ్యవస్థతోపాటు శత్రువుల జాడను, ముప్పును ముందే పసిగట్టే రాడార్ వ్యవస్థ ఇందులో ఉంది. కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ (సీఓడీఓజీ) ప్రొపల్షన్ సిస్టమ్‌తో పనిచేసే ఈ నౌక, అత్యంత వేగంగా, ఎక్కువ కాలం సముద్రంలో ప్రయాణించగలదు. యుద్ధ రంగంలోనే కాకుండా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
