గురుద్వారాలోకి వెళ్లనన్న ఆర్మీ అధికారి డిస్మిస్.. సమర్థించిన సుప్రీంకోర్టు

గురుద్వారాలోకి వెళ్లనన్న ఆర్మీ అధికారి డిస్మిస్.. సమర్థించిన సుప్రీంకోర్టు
  • మిలిటరీకి మిస్ ఫిట్ అని వ్యాఖ్య
  • యూనిఫాంలో ఉన్నప్పడు ఆదేశాలు పాటించాల్సిందేనని వెల్లడి
  • ఇలాంటి వ్యక్తులు సైన్యంలో వద్దన్న  సీజేఐ

హైదరాబాద్: గురుద్వారాలోకి ప్రవేశించి పూజ చేయడం  “నా క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధం” అని చెప్పిన లెఫ్టినెంట్‌ స్యామ్యూల్ కమలేసన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ  కఠినంగా స్పందించింది. ఆయన మిలటరీకి మిస్ ఫిట్ అని వ్యాఖ్యానించింది.  సైన్యంలో విధేయత, డిసిప్లిన్‌ వంటి ప్రాథమిక విలువల్ని పట్టించుకోని అధికారులను సహించలేమని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.  “అతను ఎంత ప్రతిభావంతుడైనా, ఆర్మీకి మిస్ఫిట్‌. ఇటువంటి మొండి వ్యక్తులు మిలటరీలో కొనసాగలేరు” అని అన్నారు.  

3వ క్యావల్రీ రెజిమెంట్‌కు చెందిన కమలేసన్‌ గురుద్వారాలోకి  వెళ్లి పూజ చేయాలన్న ఆదేశాన్ని అమలు చేయకపోవడంతో డిస్మిస్ చేశారు. మే నెలలో  ఆర్మీ ఉన్నతాధికారుల నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.  “మిలిటరీ ఉన్నతాధికారి ఆదేశం కన్నా మతాన్ని పైకి తేవడం. నియమాలకు విరుద్ధమని పేర్కొంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై కమలేసన్‌ సుప్రీంకోర్టులో సవాలు చేశారు.  

విచారణలో జస్టిస్‌ జోయ్మాలా బాగ్చి మాట్లాడుతూ, “మీ పాస్టర్‌ కూడా సలహా ఇచ్చినా వినలేదు.. యూనిఫాం‌లో ఉన్నప్పుడు వ్యక్తిగత అర్థాలు నడవవు” అని స్పష్టం చేశారు. కమలేసన్‌ తరఫున న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదిస్తూ, ఒకే ఘటన ఆధారంగా డిస్మిస్ చేయడం తీవ్రం అని, ఇతర పండుగల్లో పాల్గొనేంతవరకు మత పరమైన సహనం చూపించాడని చెప్పారు. అయితే ధర్మాసనం ఈ వాదనలు పరిగణనలోకి తీసుకోలేదు. సైన్యంలో ఆదేశమే పరమేశ్వరమని, వ్యక్తిగత విశ్వాసాలు సేవలో అంతరాయం కలిగించలేవని చెబుతూ కోర్టు పిటిషన్‌ను కొట్టి వేసింది.