
- రెండు మూడు రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్త
- మద్దతు ధరతో వడ్లు కొంటాం: కేసీఆర్
- 57 ఏండ్లు నిండినోళ్లకు కచ్చితంగా పింఛన్ ఇస్తం
- లాయర్ దంపతుల హత్య కేసు సీబీఐకి ఇవ్వం
- అగ్రి చట్టాలతో మంచి జరుగుతదని ప్రధాని చెప్పారు
- రైతులకు అవి చెడు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తరు
- కరోనా తీవ్రత పెరుగుతోంది.. జాగ్రత్తగా ఉన్నాం
- గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో సీఎం
హైదరాబాద్, వెలుగు: మద్దతు ధరతో వడ్లు కొంటామని, రెండు, మూడు రోజుల్లో అసెంబ్లీలోనే పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు. కరోనా కారణంగా రాష్ట్ర సర్కార్ మొత్తం రూ.లక్ష కోట్ల వరకు ఆదాయం కోల్పోయిందని చెప్పారు. ఉద్యోగులపై ప్రతిపక్షాలకు ఎంత ప్రేమ ఉందో అంతకన్నా ఎక్కువ ప్రేమ తమకుందని, ఆ విషయం గత పీఆర్సీ ద్వారానే రుజువు చేసుకున్నామని చెప్పారు. రైతులు పండించిన వడ్లను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. అడ్వొకేట్ వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతిదానికీ కేంద్రంతో పేచీ పెట్టుకోబోమన్నారు. వ్యవసాయ చట్టాలు రైతాంగానికి మేలు చేస్తాయని ప్రధాని తనతో చెప్పారని తెలిపారు. కరోనా తీవ్రత పెరుగుతోందని, స్కూళ్ల నిర్వహణపై ఆలోచిస్తున్నామని చెప్పారు. 57 ఏండ్లు నిండినోళ్లకు పింఛన్లు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామన్నారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సభలో ప్రవేశపెట్టగా, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మద్ధతు తెలిపారు. ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చర్చలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర గీతమంటూ ఏదీ లేదని, జయజయహే తెలంగాణను రాష్ట్ర జాతీయ గీతంగా గుర్తించలేదన్నారు. ప్రాజెక్టుల భూసేకరణకు కేంద్ర ప్రభుత్వ విధానాలు పాటిస్తున్నామని చెప్పారు. ఒక్కోచోట సేకరించే భూమికి ఒక్కో తరహా పరిహారం ఇస్తామన్నారు. గజ్వేల్‌ను ఆనుకొని ఉన్న నిర్వాసితుల కోసం 7,500 ఇండ్లతో కొత్త టౌన్ నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 3,59,974 మందికి కొత్తగా పింఛన్లు ఇస్తున్నామని, ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే పది రెట్లు అదనంగా పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. ఎస్సారెస్పీ తర్వాత రాష్ట్రంలో రెండో భారీ రిజర్వాయర్ మల్లన్నసాగర్‌ను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు 371 కేసులు వేశాయన్నారు. ప్రపంచంలో ఇంకెవరూ ప్రాజెక్టులు కట్టనట్టూ, తాము మాత్రమే ప్రజలను ముంచేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని, అది సరికాదన్నారు.
దళితుల కోసం కొత్త స్కీం
దళితుల కోసం ప్రభుత్వం కొత్త స్కీం తీసుకురాబోతుందని, బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి దీనిని ప్రకటిస్తారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేస్తున్న ప్రతిపైసా లెక్కలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందజేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై తాము మాత్రమే ట్యాక్సులు వేసినట్టుగా ‘‘భట్టి’’ చెప్తున్నారని, కాంగ్రెస్ వేసిన పన్నులకు అదనంగా తాము రెండు శాతం మాత్రమే పెంచామన్నారు. రాష్ట్రానికి పెట్రో ఉత్పత్తులపై పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని తెలిపారు.
మాకు భట్టి ప్రేమ దక్కుతలేదు
తమ ప్రభుత్వం చేసే మంచి పనులను భట్టి గుర్తించడం లేదని, భట్టి ప్రేమ తమకు దక్కడం లేదని సీఎం అన్నారు. ఉమ్మడి ఏపీ పాలకులు డిజైన్ చేసిన ప్రాజెక్టులు తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టే రీ డిజైన్ చేశామని తెలిపారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును మనవళ్లు కూడా చెప్పలేరని తాను గతంలో చెప్పానని గుర్తు చేశారు. కేవలం 14 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయర్లు.. ‘‘చారెడు.. పిడికెడు నీళ్లతో..’’ ఆ ప్రాజెక్టు ప్రతిపాదిస్తే తాము 227.77 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయర్లు నిర్మిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేశామన్నారు. కల్వకుర్తి కింద ఐదున్నర లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి 4 టీఎంసీల రిజర్వాయర్లు పెట్టారని, తాము ఒక్క పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులోనే 91 టీఎంసీల రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి పాలకులు రైతులకు నీళ్లు ఇచ్చినా ఇవ్వకున్నా తీరువా వసూలు చేసేవారని, తాము నీటి తీరువా రద్దు చేయడంతో పాటు రూ.141 కోట్ల బకాయిలను కూడా రద్దు చేశామన్నారు. ఆర్డీఎస్ ఎవరు చేసిన పాపమని ప్రశ్నించారు.
తుమ్మిళ్ల లిఫ్ట్ స్కీం పెట్టి దానిని తాము పరిష్కరిస్తున్నామని తెలిపారు. కరెంట్ కష్టాలను అధిగమించామని, మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు సరఫరా చేస్తున్నామని, పెద్ద స్కీంలు అమలు చేస్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని అన్నారు. తెలంగాణలో 75 వేల చెరువులుంటే వాటిలో 30 వేలు మాయమయ్యాయన్నారు. రైతులు తమ పంటలు కాపాడుకునేందుకు బోర్లు వేయించి సర్వం కోల్పోయారని, తానే 37 బోర్లు వేయించానని గుర్తు చేశారు. చెరువులన్నీ ప్రాజెక్టుల నీళ్లతో నిండు కుండల్లా ఉన్నాయన్నారు. భూగర్భ జలాలు పెరిగాయన్నారు.
ప్రజలు మమ్మల్నే నమ్ముతున్నరు
తమపైనే రాష్ట్ర ప్రజలకు విశ్వాసం ఉందని కేసీఆర్ అన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినా ప్రజలు నమ్మలేదని, రూ.లక్ష రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన తమను మాత్రమే విశ్వాసంలోకి తీసుకొని ఓట్లేశారని తెలిపారు. రైతులపై వడ్డీ భారం పడనివ్వబోమని తేల్చిచెప్పారు. పోడు భూముల సమస్యను తానే స్వయంగా పరిష్కరిస్తానని చెప్పానని, అయితే కరోనా కారణంగా దాన్ని చేయలేకపోయామన్నారు. పోడు భూముల సమస్యను 100శాతం పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు కనిపించకుండా చేసిందెవరని ప్రశ్నించారు. తాము హరితహారంతో అడవుల పునరుజ్జీవానికి పాటు పడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో గ్రీన్ కవర్ 3.7 శాతం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రాష్ట్ర వాటాను ఈనెలాఖరులోగా చెల్లిస్తామన్నారు.
మంచి ఎక్కడున్నా తీసుకుంటం
అన్నీ తమకే తెలుసని అనుకోవడం లేదని సీఎం అన్నారు. మంచి ఎక్కడున్నా తీసుకుంటామని చెప్పారు. ఉచిత విద్యుత్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెచ్చారని, కానీ అప్పుడు కరెంట్ వచ్చేది కాదన్నారు. బస్తీ దవాఖానాలు ఢిల్లీ ప్రభుత్వం నుంచి, కేసీఆర్ కిట్‌ను తమిళనాడులో జయలలిత ప్రవేశపెట్టిన అమ్మ కిట్ నుంచి తీసుకున్నామని తెలిపారు. కరోనాతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రూ.52 వేల కోట్ల ఆదాయం కోల్పోయినా సంక్షేమం ఆపలేదన్నారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టి ఆసరా పింఛన్‌లు ఇచ్చామన్నారు. పల్లె, పట్టణ ప్రగతికి క్రమం తప్పకుండా నిధులు ఇచ్చామన్నారు. దేశంలోనే ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. యాదవ కుల వృత్తిని నిలబెట్టేందుకు గొర్రెలు పంపిణీ చేశామని, ఈ బడ్జెట్‌లోనూ ఈ పథకానికి నిధులు ఇవ్వబోతున్నామని చెప్పారు.
కాంగ్రెస్ వేసిన పునాదులే..
దేశ ప్రగతికి కాంగ్రెస్ పార్టీ, జవహర్‌లాల్ నెహ్రూనే పునాదులు వేశారని సీఎం అన్నారు. నెహ్రూ మార్గంలోనే తాము పయనిస్తున్నామని తెలిపారు. తాము చేస్తున్న అభివృద్ధిని, మంచిని కూడా కాంగ్రెస్ గుర్తించడం లేదన్నారు. ధరణి పోర్టల్‌తో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయని తెలిపారు. భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం అయితే జీఎస్‌డీపీ 3 నుంచి 4 శాతం వృద్ధి ఉంటుందని పరిశోధనల్లో తేలిందన్నారు.
లాయర్ దంపతుల హత్యకేసులో ఎవ్వర్నీ వదలం
అడ్వొకేట్ దంపతుల హత్య విచారకరమని సీఎం అన్నారు. ఇలాంటి ఘటనలు జరగాలని ఎవ్వరూ కోరుకోరన్నారు. వారి హత్యలతో టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధం లేదన్నారు. తమ పార్టీ మండల అధ్యక్షుడు నిందితుడిగా ఉంటే వెంటనే అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని తెలిపారు. మరుసటి రోజే వారు వెళ్లి పోలీసులకు సరెండర్ అయ్యారని చెప్పారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. ఈ కేసును హైకోర్టు పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర పోలీసులు అద్భుతంగా పనిచేస్తారని, ఈ కేసులో ఎవ్వరి ప్రమేయమున్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు.
ప్రభుత్వం రాసి ఇచ్చిందే గవర్నర్ చదువుతరు
ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రమే గవర్నర్ చదువుతారు తప్ప.. భట్టి రాసిచ్చినది కాదని సీఎం అన్నారు. తమ సర్కార్ చేసింది ఎక్కువ ఉంది కాబట్టే గవర్నర్ స్పీచ్ కాపీలో పేజీలు ఎక్కువున్నాయన్నారు. ఆరేండ్లలో తమ సర్కార్ చేసిన పథకాలను గవర్నర్ తన ప్రసంగంలో సమీక్షించారన్నారు. కేంద్రం నిర్దేశించిన ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నామరన్నారు. ఈ లెక్కలను కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్‌లో చెప్పిందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు భవిష్యత్‌లో మరిన్ని అప్పులు చేస్తామని తెలిపారు.
కరోనా పెరుగుతోంది.. క్లాసులపై త్వరలో నిర్ణయం
రాష్ట్రంలో వారం రోజులుగా కరోనా తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తోందని కేసీఆర్ అన్నారు. స్కూళ్లు, హాస్టళ్లలోని విద్యార్థులకు కరోనా వ్యాప్తి చెందుతోందన్నారు. పిల్లల భవిష్యత్ ముఖ్యమని, క్లాసులు నిర్వహించాలా, లేదా అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనాను కట్టడి చేయడంలో దేశంలోనే ముందున్నామని తెలిపారు. పక్కనున్న మహారాష్ట్రలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. కరోనాను అదుపులో ఉంచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు.
పార్లమెంట్ చట్టం చేస్తే అమలు చేయాల్సిందే
వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉందని, కొత్త వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్ చట్టం చేస్తే రాష్ట్రం అమలు చేసి తీరాల్సిందేనని కేసీఆర్ చెప్పారు. పంజాబ్, రాజస్థాన్ అసెంబ్లీలు ఈ చట్టాలపై చేసిన తీర్మానాలు కేవలం కంటి తుడుపు చర్యలే అన్నారు. వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించిందని, న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశంపై ఎక్కువగా మాట్లాడటం సరికాదన్నారు. తాను ప్రధానిని కలిసినప్పుడు రైతులకు కొత్త చట్టాలు ఎంతో మేలు చేస్తాయని చెప్పారన్నారు. ఒకవేళ ఆ చట్టాలు రైతు వ్యతిరేకంగా ఉంటే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. రాష్ట్రంలో మార్కెట్ యార్డులను కొనసాగిస్తామన్నారు. యాసంగిలో రైతులు పండించిన వడ్లను మద్ధతు ధరతో కొనుగోలు చేస్తామన్నారు. గ్రామాల్లో పాక్షికంగా కొనుగోలు కేంద్రాలు ఉండవచ్చని, మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోళ్లు ఉంటాయని చెప్పారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని, ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లతో ఏడెనిమిది వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఎఫ్‌సీఐ 80 లక్షల టన్నుల ధాన్యం తీసుకునేందుకు సిద్ధంగా ఉందని, చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
నిరుద్యోగులు ఎవరో తేల్చాలే
నిరుద్యోగ భృతి హామీని అమలు చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే కరోనా తీవ్రత పెరిగిందని సీఎం చెప్పారు. ఎవరు నిరుద్యోగులో తేల్చేందుకు విధివిధానాలు ఖరారు చేస్తున్నామని తెలిపారు. కొన్ని రాష్ట్రాలు నిరుద్యోగ భృతి ఇచ్చి తర్వాత పక్కన పెట్టాయన్నారు. కరోనాతో ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఇప్పుడు నిరుద్యోగ భృతి ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు.