
హసన్: హార్ట్ అటాక్ 21 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరిగింది. కె.వి.కవన అనే యువతి హసన్ నగరంలోని ఎంజీ రోడ్లో ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. ఫైనల్ ఎగ్జామ్స్ రాసి ఇంటి దగ్గరే ఉంటోంది. బుధవారం సాయంత్రం ఇంట్లో తాగడానికి నీళ్లు లేకపోవడంతో బయటకు వెళ్లి నీళ్లు తెస్తున్న క్రమంలో ఆమెకు తట్టుకోలేని ఛాతి నొప్పి వచ్చింది. ఇంటికొచ్చి నీళ్ల క్యాన్ కిచెన్లో పెట్టేసి హాల్లోకి వచ్చి మంచంపై పడుకుంది. కొంతసేపటికి తన తల్లిని నీళ్లు కావాలని అడిగింది.
ఆమె నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే లోపే కవన నట్టింట్లో కుప్పకూలిపడిపోయింది. ఆమె తల్లి కూతురిని హుటాహుటిన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కవన అకాల మరణంతో ఆమె తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. 21 ఏళ్లకే తమ కూతురికి నూరేళ్లు నిండిపోయాయని ఆ యువతి తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. హసన్ జిల్లాలో గుండెపోటు కారణంగా నెల రోజుల్లో ఇద్దరు యువతులు, ఒక యువకుడు చనిపోవడంతో జిల్లా వాసులు ఆందోళన చెందారు.
హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడపాల్సిన వయసులో ఈ మరణాలేంటీ.. అనేవి అందర్నీ వేధిస్తున్న ప్రశ్నలు. టెక్నాలజీ ఎంత పెరిగినా.. సరైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోకపోతే వ్యాధుల బారిన పడాల్సిందేనని దీన్ని బట్టి తెలుస్తోంది. మనిషికి డబ్బు అవసరమే. కానీ ఆ హడావిడిలో పడి చాలా మంది ఆరోగ్యాన్ని పక్కన పెడుతున్నారు. చిన్న చిన్న వాటికే ఆవేదన చెందడం, తినడానికి కూడా తీరిక లేకపోవడంతో పస్తులు ఉండి సమస్యలు తెచ్చుకోవడం, టెన్షన్, బాధ నేపథ్యంలో చిరాకు పడడం, నిద్రలేమి వంటి ఎన్నో కారణాలు నేటి యువతను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
►ALSO READ | Sharmistha Panoli: ఇంటర్నెట్లో ఫుల్ ట్రెండ్ అవుతున్న ఈ యువతి ఎవరు..? ఎందుకు అరెస్ట్ చేశారు..?
హార్ట్ అటాక్ సంకేతాలేంటంటే.. ఛాతి మధ్యలో నొప్పి వస్తుంది. ఛాతి మీద బరువు పడ్డట్టు ఉంటుంది. అంతేకాకుండా ఛాతిని దగ్గరికి లాగినట్టు అనిపిస్తుంది. ఈ లక్షణాలు చిన్నగా మొదలై, అప్పుడప్పుడూ వచ్చిపోతుంటాయి. అప్పుడు గుండెలో మంటగా ఉంటుంది.