ఆర్థిక ఇబ్బందుల వ‌ల్లే ఐశ్వ‌ర్య ఆత్మ‌హ‌త్య‌

ఆర్థిక ఇబ్బందుల వ‌ల్లే ఐశ్వ‌ర్య ఆత్మ‌హ‌త్య‌

కాలేజీ యాజ‌మాన్యం తప్పేమీ లేద‌న్న ఆమె త‌ల్లి

చదువుకునేందుకు ఆర్థిక స్థోమ‌త‌ సరిపోకనే త‌న కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్య తల్లి మీడియా సమావేశంలో తెలిపింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ శ్రీనివాస కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్యా రెడ్డి ఈ నెల 3న ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. ఢిల్లీ శ్రీరామ్ లేడీ కాలేజ్ లో సీటు సంపాదించి బీఎస్సీ సెకండియర్‌ చదువుకుంటున్న ఆమె, కరోనా నేపథ్యంలో ఇటీవల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో హాస్టల్ ఖాళీ చేయాలని సమాచారం అంద‌డంతో.. ఇంట్లో ఆర్థిక విషయాలపై చర్చ జరిగింది. ఆ తర్వాత ఈ నెల 3వ తేదీన ఇంట్లో ఉరి వేసుకుంది. అయితే ఆదివారం కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా బ‌య‌ట‌ప‌డింది.

సోమ‌వారం విద్యార్థిని ఐశ్వ‌ర్య త‌ల్లి మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. త‌మ‌ ఇంట్లో ఆర్ధిక పరిస్థితి బాగలేకనే త‌మ కూతురు ఆత్మహత్య చేసుకున్నద‌ని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా మార్చి నెల‌లో ఇంటికి వ‌చ్చిందని, అయితే హాస్టల్ ఖాళీ చేయాలని కాలేజ్ యాజమాన్యం సెప్టెంబర్ లో స‌మాచార‌మిచ్చార‌ని తెలిపారు. హాస్టల్ ఖాళీ చేసేందుకు వెళ్ల‌డానికి కూడా త‌మ ద‌గ్గ‌ర డబ్బులు లేకపోవ‌డంతో ఐశ్వ‌ర్య  మ‌న‌స్థాపం చెందింద‌ని అన్నారు. ఆమె చదువు కోసం ఇంటి లోన్ , గోల్డ్ లోన్ కూడా తీసుకున్నామని, ఇప్పటి వరకు నాలుగు లక్షలు ఖర్చు చేశామ‌ని చెప్పారు.

అప్పుల వాళ్ళు రోజు ఇంటికి రావటం, ఇప్పటికే నాలుగు లక్షలు ఖర్చు చేశాం కాబట్టి, ఇక త‌మ‌ మీద భారం పడవద్దు అని మనస్తాపంతో ఐశ్వ‌ర్య ఆత్మహత్య చేసుకుంద‌ని ఆమె అన్నారు. ఐశ్వ‌ర్య చావుకు త‌మ‌ ఆర్థిక పరిస్థితులే కారణమ‌ని, కాలేజీ యాజమాన్యం తప్పు ఏమీ లేద‌ని అన్నారు. ప్రభుత్వం త‌మ‌కు సహాయం చేస్తే మ‌రో కూతుర్ని చ‌దివిస్తామ‌ని ఆమె అన్నారు.