కోర్టుల మీద విశ్వసనీయత తగ్గిపోతుంది

కోర్టుల మీద విశ్వసనీయత తగ్గిపోతుంది

కోర్టుల మీద విశ్వసనీయత పెరగాలంటే అవి తీర్పులను, ఉత్తర్వులను ఎలాంటి జాప్యం లేకుండా వెలువరించాలి. తమ నిర్ణయానికి తగిన కారణాలను కూడా చెప్పాలి. ఇవి రెండూ లేనప్పుడు కోర్టుల మీద విశ్వసనీయత తగ్గిపోతుంది. ఈ మాటలు ఎందుకు రాయాల్సి వస్తుందంటే సుప్రీంకోర్టు గత వారం బాంబే హైకోర్టు మీద ఓ  సీరియస్​ కామెంట్ చేసింది. బెయిల్ ​ఉత్తర్వులు జారీ చేయడంలో జరిగిన జాప్యాన్ని గమనించి, ఆ ఉత్తర్వులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఒక కేసులో నిందితుడికి బెయిల్ ​పిటిషన్​ను తిరస్కరించడానికి బాంబే హైకోర్టు నెల మీద వారం రోజుల సమయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వుల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టులోని త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు బీ ఆర్​ గవాయ్, విక్రమ్​నాథ్, సంజయ్​ కరోల్​ ఈ వ్యాఖ్యలు చేశారు.  సుమిత్​ సుభాష్​​ చంద్రబోస్​ గంగావల్​మరొకరు వర్సెస్ ​స్టేట్​ ఆఫ్​ మహారాష్ట్ర కేసులో ముద్దాయికి అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణను సుప్రీంకోర్టు కల్పించింది. ఈ ఉత్తర్వులు జారీ చేయడానికి కోర్టు మూడు విషయాలను పరిగణనలోకి తీసుకుంది.

ఒకటి: పార్టీల మధ్య సివిల్​తగాదాలు ఉన్నాయి. ఒకరిపై ఒకరు సివిల్​కేసులు పెట్టుకున్నారు. రెండు: ప్రాథమికంగా చూసినప్పుడు షెడ్యూల్డ్​కులాలు, షెడ్యూల్డ్​తెగల చట్టంలోని నిబంధనల ప్రకారం నేరం జరిగిందనడానికి ఆధారాలు లేవు.మూడు: ఎఫ్ఐఆర్ ​జారీ చేయడంలో ఆలస్యం జరిగింది. ఈ సంఘటన 2022 ఫిబ్రవరి 17న జరిగిందని ఆరోపించబడింది. ఎఫ్ఐఆర్​ను 2022 ఫిబ్రవరి 23న జారీ చేశారు. అంటే ఎఫ్ఐఆర్​జారీ చేయడంలో ఆరు రోజులు ఆలస్యం జరిగింది.ముద్దాయిపై ఆరోపించిన నేరాలకు కస్టోడియల్​విచారణ అవసరం లేదని సుప్రీం బెంచ్​ ప్రాథమికంగా గుర్తించింది. ఈ కేసులో ముద్దాయి బెయిల్ పిటిషన్​ను బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ​బెంచ్​లోని న్యాయమూర్తి సి. సంత్ ​మార్చి 1న బెయిల్​ను తిరస్కరించారు. ఈ కేసులో న్యాయమూర్తి వాదనలను విన్నది జనవరి 25, ఉత్తర్వులు ఇచ్చింది  మార్చి 1న. అంటే బెయిల్​దరఖాస్తులో ఉత్తర్వులు రావడానికి నెల మీద వారం సమయం న్యాయమూర్తి తీసుకున్నారు. బెయిల్ ​ఉత్తర్వులు 13 పేజీలు దాటిపోయింది. 

నాలుగు ముక్కలు రాయడానికి నెల రోజులు?

ఈ కేసులో దరఖాస్తుదారుల పొలాన్ని తవ్వుతున్న కూలీలు తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదుదారు ఎఫ్ఐఆర్​లో ఆరోపించాడు. ఆ కారణంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు అయింది. దరఖాస్తుదారులు ఔరంగాబాద్​లోని సెషన్స్​కోర్టును బెయిల్​కోసం ఆశ్రయించారు. ముందస్తు బెయిల్​మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్​ను మంజూరు చేయకూడదు. అయితే ఆ చట్టం కింద నేరం జరగలేదని కోర్టు భావిస్తే ముందస్తు బెయిల్​ను మంజూరు చేయవచ్చు. న్యాయమూర్తి కిశోర్​సంత్​ప్రకారం ఆ చట్టం కింద నేరం జరిగింది. అందుకు ఆయన ఆ చట్టంలోని సెక్షన్​18 ప్రకారం ముందస్తు బెయిల్​దరఖాస్తును తిరస్కరించారు. అంత వరకు ఫర్వాలేదు. కానీ ఆ నాలుగు ముక్కలు రాయడానికి నెల మీద వారం రోజులు తీసుకోవాల్సిన అవసరం లేదు. 13 పేజీల ఉత్తర్వులు అంతకన్నా అవసరం లేదు. ఇది సుప్రీంకోర్టు అన్నమాట. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరాలను తీవ్రంగా పరిగణించాల్సిందే. అందులో అనుమానం లేదు. కానీ బాధితులు పైకోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉండే విధంగా ఉత్తర్వులను ఎలాంటి జాప్యం లేకుండా జారీ చేయాల్సి ఉంటుంది. ఈ కేసులో నోటీసు జారీ చేస్తూ సుప్రీంకోర్టు ముద్దాయిలను అరెస్ట్​చేయకూడదని తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత దాన్ని సంపూర్ణం చేసింది. 

సుప్రీం తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా..

1980 నుంచి సుప్రీంకోర్టు చెబుతున్నప్పటికీ హైకోర్టు న్యాయమూర్తుల్లో రావాల్సిన గుణాత్మకమైన మార్పు కనిపించడం లేదు. ఈ విషయాన్ని హైకోర్టు న్యాయమూర్తులకు చెప్పడంలో జాతీయ జ్యూడీషియల్​అకాడమీ శ్రద్ధ తీసుకోవాలేమో! పార్టీలు సత్వర న్యాయం కోరుకుంటున్నాయి. కేసు రిజర్వు చేసిన తర్వాత ఎక్కువకాలం అలాగే ఉంచకూడదని, తీర్పులకు ఉత్తర్వులకు తగిన సహేతుక కారణాలు చెప్పాలని కోరుకుంటున్నాయి. ఈ మధ్య తెలంగాణ హైకోర్టు ఓ న్యాయవాద మిత్రుడు చెప్పిన ప్రకారం.. ఓ క్రిమినల్​అప్పీలులో వాదనలు విని తీర్పు చెప్పడానికి తీసుకున్న సమయం 9  నెలలు. అప్పీలు చేసిన వ్యక్తి జైలులో ఉన్నాడు. నిర్ణయం ప్రకటించడానికి ఇంత సమయం అవసరమా?  ఆ వ్యక్తి ఎంత వేదనని అనుభవించి ఉంటాడు. ఇలా ఆలస్యంగా తీర్పులు చెప్పడం అనిల్ ​రామ్​వర్సెస్​ స్టేట్​ఆఫ్​ బీహార్(2001 సుప్రీంకోర్టు) కేసు లోని తీర్పు స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఈ విషయంలో న్యాయవాదుల సంఘం చొరవ తీసుకొని ఓ సెమినార్​ను ఏర్పాటు చేయాలి. 

పది నిమిషాలు చాలు!

బెయిల్​దరఖాస్తులను పరిష్కరించడానికి రోజుల తరబడి వాదనలు వినాల్సిన అవసరం లేదు. పది నిమిషాల్లో వాదనలను ముగించాలి. అంతకు మించి సమయాన్ని కోర్టులు కేటాయిస్తే  అది కోర్టు సమయాన్ని వృథా చేయడమేనని సుప్రీం బెంచ్​లోని న్యాయమూర్తులు సంజయ్​కిషన్​కౌల్, ఏఎస్. ఓకా నిరుడు డిసెంబర్​లో ఒక బెయిల్​అప్లికేషన్​ను పరిష్కరిస్తూ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఉమర్ ​ఖలీద్​కు బెయిల్​ నిరాకరిస్తూ తనపై చేసిన వ్యాఖ్యలను కొట్టివేయాలని షర్జీలాల్​ఇమామ్​అనే వ్యక్తి సుప్రీంను ఆశ్రయించాడు. తన వాదనలు వినకుండా, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తూ కోర్టు ఆ ఆదేశాలు జారీ చేసిందని ఇమామ్​ సుప్రీంకు  తెలిపాడు. ఖలీద్ బెయిల్​దరఖాస్తు ఢిల్లీ హైకోర్టు 20 రోజులకు పైగా విచారించింది. ఇమామ్ ​కేసును విచారిస్తున్న క్రమంలో సుప్రీం బెయిల్ ​పిటీషన్ ​వాదనలు, తీసుకోవాల్సిన సమయంపై  వ్యాఖ్యానించింది.

సుదీర్ఘ ఉత్తర్వులు అవసరమా?

‘‘బెయిల్​ఉత్తర్వుల్లో సాక్ష్యాలను సంపూర్ణంగా, వివరంగా పరిశీలించాల్సిన అవసరం లేదు. పౌరుల స్వేచ్ఛకు సంబంధించిన అంశాల్లో కోర్టులు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, వాటిని సత్వరంగా పరిష్కరించాలి. ఏ మాత్రం ఆలస్యం చేసినా అది రాజ్యాంగ స్ఫూర్తికే భంగం కలిగించినట్టు’’ అని సుప్రీం అభిప్రాయపడింది. నిరంజన్ ​సింగ్​వర్సెస్ ​ప్రభాకర్ ​రాజారామ్​కరోటే(1980) కేసును సుప్రీం పేర్కొంది. ముందస్తు బెయిల్ మంజూరు చేసేటప్పుడు, తిరస్కరించేటప్పుడు. వివరమైన ఉత్తర్వులు అవసరం లేదని1980లో పేర్కొంది. అయినా న్యాయమూర్తులు బెయిల్​ పిటిషన్లలో సుదీర్ఘ ఉత్తర్వులు రాస్తూనే ఉన్నారు. 
డా మంగారి రాజేందర్ ,జిల్లా సెషన్స్ జడ్జి రిటైర్డ్