IPL 2025: క్యాపిటల్స్ మాస్టర్ ప్లాన్ ఫలిస్తుందా.. మరో ప్రయోగానికి రాహుల్‌ రెడీ

IPL 2025: క్యాపిటల్స్ మాస్టర్ ప్లాన్ ఫలిస్తుందా.. మరో ప్రయోగానికి రాహుల్‌ రెడీ

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది. తొలి నాలుగు మ్యాచ్ లు గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ రేస్ లో అందరి కంటే ముందున్న ఢిల్లీ.. ఆ తర్వాత వరుస ఓటములు ఆ జట్టును కృంగదీశాయి. తొలి నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించిన అక్షర్ సేన.. ఆ తర్వాత జరిగిన 7 మ్యాచ్ ల్లో రెండే గెలిచింది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఢిల్లీకి మిగిలిన మూడు మ్యాచ్ ల్లో రెండు విజయాలు తప్పనిసరి. మూడు మ్యాచ్ లు కూడా ముంబై, పంజాబ్, గుజరాత్ లాంటి జట్లతో ఉండడంతో కఠిన పరీక్ష తప్పేలా కనిపించడం లేదు. 

జట్టులో ఇప్పటికే నలుగురు ఫారెన్ ప్లేయర్లు దూరం కావడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ. ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తో పాటు స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ సీజన్ ఐపీఎల్ కు అందుబాటులో ఉండదని అధికారికంగా తన నిర్ణయాన్ని తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్ కోసం ఇండియాకు రావట్లేదని తెలిపాడు. డుప్లెసిస్ తో పాటు సహచరుడు డెనోవన్ ఫెరారా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఒకే సారి నాలుగు ఫారెన్ ప్లేయర్లను దూరం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది.

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, డుప్లెసిస్ దూరం కావడంతో ఇప్పుడు ఢిల్లీ ఆశలన్నీ ఆ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పై పడింది. రాహుల్ ను ఢిల్లీ  జట్టు ఓపెనర్ గా ప్రమోట్ చేయాలనీ భావిస్తోందట. కేఎల్ ఓపెనర్ గా బరిలోకి దిగడం దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఈ సీజన్ లో రాహుల్ ఎక్కువగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఒకసారి ఓపెనర్ గా.. రెండు సార్లు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. గతంలో ఓపెనర్ గా రాహుల్ కు అద్భుతమైన రికార్డ్ ఉంది. దీంతో కేఎల్ ను ప్లే ఆఫ్స్ ముందు కీలక మ్యాచ్ లకు ఓపెనర్ గా పంపించాలని చూస్తోంది. క్రీజ్ లో కుదురుకుంటే రాహుల్ అలవోకగా భారీ ఇన్నింగ్స్ ఆడగలడు. దీంతో ఢిల్లీ ఆశలన్నీ రాహుల్ పైనే పెట్టుకుంది. 

►ALSO READ | RCB vs KKR: వరుణుడు కరుణించడం కష్టమే: కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌కు భారీ వర్ష సూచన!

ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 11 మ్యాచ్ ల్లో 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్ లు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది. రీ షెడ్యూల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ ను ఆదివారం (మే 18) గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది.