గుజరాత్‌‌ నాలుగోసారీ .. మళ్లీ ఓడిన జెయింట్స్

గుజరాత్‌‌ నాలుగోసారీ ..  మళ్లీ ఓడిన జెయింట్స్
  •     25 రన్స్‌‌ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విక్టరీ
  •     రాణించిన లానింగ్‌‌, జొనాసెన్‌‌

బెంగళూరు : విమెన్స్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌ (డబ్ల్యూపీఎల్‌‌)లో గుజరాత్‌‌ జెయింట్స్‌‌కు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా నాలుగో మ్యాచ్‌‌లోనూ ఓడి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దెబ్బతీసుకుంది. బ్యాటింగ్‌‌లో కెప్టెన్‌‌ మెగ్‌‌ లానింగ్‌‌ (41 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 55), అలీస్ క్యాప్సీ (27) రాణించడంతో.. ఆదివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ 25 రన్స్‌‌ తేడాతో గుజరాత్‌‌ను ఓడించింది. టాస్‌‌ ఓడిన ఢిల్లీ తొలుత 20 ఓవర్లలో 163/8 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో గుజరాత్‌‌ 20 ఓవర్లలో 138/8 స్కోరుకే పరిమితమైంది. ఆష్లే గార్డ్‌‌నర్‌‌ (40) మాత్రమే పోరాడింది. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్‌‌, జొనాసెన్‌‌ చెరో 3 వికెట్లు తీశారు. జొనాసెన్‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

మేఘనా మెరిసినా..

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన ఢిల్లీని గుజరాత్‌‌ బౌలర్‌‌ మేఘనా సింగ్‌‌ (4/37) కట్టడి చేసే ప్రయత్నం చేసింది. అయితే ఓపెనర్‌‌ కమ్ కెప్టెన్ మెగ్‌‌ లానింగ్‌‌ దూకుడుగా ఆడి మంచి భాగస్వామ్యాలతో భారీ స్కోరుకు బాటలు వేసింది. తొలి వికెట్‌‌కు 20 రన్స్‌‌ జోడించి హిట్టర్‌‌ షెఫాలీ వర్మ (13) ఔటైనా, క్యాప్సీ మెరుపు ఇన్నింగ్స్‌‌ ఆడింది. పవర్‌‌ఫుల్‌‌ హిట్టింగ్‌‌తో వరుసగా బౌండ్రీలు బాదుతూ రెండో వికెట్‌‌కు 38 రన్స్‌‌ జత చేసింది. దీంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో డీసీ 76/2 స్కోరుతో నిలిచింది. కానీ వరుస ఓవర్లలో లానింగ్‌‌, జెమీమా (7) వెనుదిరగడంతో డీసీ 111 రన్స్‌‌కు 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సదర్లాండ్‌‌ (27) నిలకడగా ఆడినా.. గార్డ్‌‌నర్‌‌ (2/37) లోయర్‌‌ ఆర్డర్‌‌ను దెబ్బతీసింది. తన వరుస ఓవర్లలో జొనాసెన్‌‌ (11), అరుంధతి రెడ్డి (5)ని పెవిలియన్‌‌కు పంపగా, మధ్యలో సదర్లాండ్‌‌ను మన్నత్‌‌ కశ్యప్‌‌ (1/16) ఔట్‌‌ చేసింది. చివర్లో రాధా యాదవ్‌‌ (5) విఫలమైనా, శిఖా పాండే (14 నాటౌట్‌‌) వేగంగా ఆడటంతో డీసీ మంచి టార్గెట్‌‌ను నిర్దేశించింది. 

బౌలింగ్‌‌ అదుర్స్‌‌

ఛేజింగ్‌‌లో గుజరాత్‌‌ను డీసీ బౌలర్లు ఆరంభం నుంచి దెబ్బతీశారు. రెండో ఓవర్‌‌లోనే లారా వోల్‌‌వర్త్‌‌ (0)ను శిఖా పాండే (1/28) డకౌట్‌‌ చేసింది. ఐదో ఓవర్‌‌లో జొనాసెన్‌‌ డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చింది. నాలుగు బాల్స్‌‌ తేడాలో బెత్‌‌ మూనీ (12), లిచ్‌‌ఫీల్డ్ (15)ను పెవిలియన్‌‌కు పంపింది. తర్వాత  గార్డ్‌‌నర్‌‌ నిలకడగా ఆడినా.. రెండోఎండ్‌‌లో  స్పిన్నర్‌‌ రాధా యాదవ్‌‌ కూడా రెండు వికెట్లు తీసి ఝలక్ ఇచ్చింది. 8వ ఓవర్‌‌లో వేదా కృష్ణమూర్తి (12)ని, 11వ ఓవర్‌‌లో కేథరిన్‌‌ బ్రైస్‌‌ (3)ను ఔట్‌‌ చేసింది. పవర్‌‌ప్లేలో 41/3తో జీటీ ఒక్కసారిగా 73/5తో కష్టాల్లో పడింది. తనూజ కన్వర్‌‌ (13) సింగిల్స్‌‌కే పరిమితం కావడంతో రన్‌‌రేట్‌‌ మందగించింది. దాదాపు ఐదు ఓవర్ల పాటు రన్‌‌రేట్ పెంచడానికి ట్రై చేసిన గార్డ్‌‌నర్‌‌ 15వ ఓవర్‌‌లో ఔట్‌‌ కావడంతో గుజరాత్‌‌ ఛేజింగ్‌‌లో వెనకబడింది. చివర్లో వరుస విరామాల్లో కన్వర్‌‌, తారానుమ్‌‌ పఠాన్‌‌ (9) ఔట్‌‌ కాగా, మేఘనా సింగ్‌‌ (10 నాటౌట్‌‌), సయాలీ (7 నాటౌట్‌‌) టార్గెట్‌‌ను అందుకోలేకపోయారు. 

1విమెన్స్‌ టీ20ల్లో వేగంగా 9 వేల రన్స్‌‌ చేసిన బ్యాటర్‌‌గా లానింగ్‌‌ రికార్డులకెక్కింది. 289 ఇన్నింగ్స్‌‌లో ఈ ఫీట్‌‌ సాధించిన లానింగ్‌‌.. సోఫీ డివైన్‌‌ (297 ఇన్నింగ్స్‌‌)ను అధిగమించింది.

సంక్షిప్త స్కోర్లు

ఢిల్లీ : 20 ఓవర్లలో 163/8 (లానింగ్‌‌ 55, క్యాప్సీ 27, సదర్లాండ్‌‌ 20, మేఘనా 4/37). గుజరాత్‌‌: 20 ఓవర్లలో 138/8 (గార్డ్‌‌నర్‌‌ 40, రాధా 3/20, జొనాసెన్‌‌ 3/22).