
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 43 కు చేరుకుంది. ఆదివారం అనాజ్ మండిలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిందీ ఘటన. ప్రమాదం గురించి తెలుసుకొన్న ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం చాలా విషాదకరమని, ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నామన్నారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. గాయపడ్డ వారికి రూ.లక్ష పరిహారం ఇస్తామన్నారు.
ఈ విషాద సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మృతి చెందిన వారి కుటుంబాలకు రూ .2 లక్షల ఎక్స్-గ్రేషియాను ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 ఆర్ధిక సాయం అందించేందుకు ఆమోదించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున మంటలు రావడం గమనించిన స్థానికులు, అగ్ని మాపక సిబ్బంది.. 62 మందిని కాపాడారు. 43 మంది అక్కడే సజీవ దహనమయ్యారు. గాయపడిన వారిని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.