తీహార్ జైలుకు కేజ్రీవాల్

తీహార్ జైలుకు కేజ్రీవాల్
  • బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయిన ఢిల్లీ సీఎం 
  • ఈ నెల 5 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు 

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోయారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఆయనకు లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా, ఆ గడువు ఈ నెల 1తో ముగిసింది. దీంతో ఆదివారం తీహార్ జైల్లో కేజ్రీవాల్ సరెండర్ అయ్యారు. ఆయనకు ఈ నెల 5 వరకు రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. 

కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోవడానికి ముందు రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీకి నివాళులర్పించి, కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ టెంపుల్ లో పూజలు చేశారు. అనంతరం పార్టీ ఆఫీస్ వద్ద నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘నేను తిరిగి జైలుకు వెళ్తున్నాను. కానీ అవినీతికి పాల్పడినందుకు కాదు.. నియంతృత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు” అని కేజ్రీవాల్ అన్నారు. ‘‘నాకు సుప్రీంకోర్టు 21 రోజుల బెయిల్ ఇచ్చింది. ఈ 21 రోజులు ఎప్పటికీ మరిచిపోలేను. ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా పని చేశాను. దేశాన్ని కాపాడేందుకు ప్రచారం నిర్వహించాను. నాకు దేశమే ఫస్ట్. ఆ తర్వాతే పార్టీ” అని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని, అదంతా బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని అన్నారు. కాగా, జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ వెంట జైలు వరకు ఆయన భార్య సునీత, ఆప్ నేతలు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్ తదితరులు వచ్చారు.