న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఐదోసారి కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో శుక్రవారం తమ ఎదుట హాజరుకావాలని ఆయనకు ఈడీ బుధవారం సమన్లు పంపింది. అయితే, ఆయన విచారణకు వెళ్లలేదు. కాగా, కేజ్రీవాల్‌కు ఈడీ పంపిన సమన్లు చట్టవ్యతిరేకమని, ఆయనను అరెస్టు చేసేందుకు ఈడీ అదేపనిగా నోటీసులు పంపుతున్నదని ఆప్ మండిపడింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీజేపీ కుట్రపన్నుతున్నదని ఆరోపించింది.
మా ఎమ్మెల్యేల గృహ నిర్బంధం: ఆప్
తమ ఎమ్మెల్యేలను గృహ నిర్బంధంలో ఉంచారని, అలాగే తమ వలంటీర్లు బీజేపీ ప్రధాన కార్యాలయం బయట నిరసన తెలపకుండా అడ్డుకున్నారని ఆప్ ఆరోపించింది. ఇటీవల జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసంచేసి గెలిచిందని ఆరోపిస్తూ ఆప్ నేతలు శుక్రవారం సెంట్రల్ ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ బయట నిరసన ప్రదర్శన చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతను పెంచారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. ఈ సందర్భంగా ఆప్ లీడర్ గోపాల్ రాయ్ మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లను గృహ నిర్బంధంలో ఉంచారని ఆరోపించారు. వారందరినీ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ప్రదర్శనను అడ్డుకోవడంపై కేజ్రీవాల్ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
సమన్లు చట్టవిరుద్ధమైతే కోర్టుకెళ్లండి: బీజేపీ
సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు ఈడీ జారీచేసిన సమన్లు చట్టవిరుద్ధమైతే కోర్టుకెళ్లి వాటిని రద్దు చేయించుకోవాలని ఆప్ కు బీజేపీ సవాల్ విసిరింది. శుక్రవారం బీజేపీ నేత మీనాక్షి లేఖి మాట్లాడుతూ తాను అవినీతికి పాల్పడినట్లు కేజ్రీవాల్ కు తెలుసని, అందుకే ఈడీ విచారణకు హాజరు కావడంలేదని విమర్శించారు.
చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీం విచారణ
చండీగఢ్ మేయర్ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని కోరుతూ ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. అంతకుముందు పంజాబ్–హర్యానా హైకోర్టులో కుల్దీప్ ఈ పిటిషన్ వేయగా హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కుల్దీప్ తరపున అభిషేక్ సింఘ్వీ ఈ పిటిషన్ వేశారు.