పరువు నష్టం దావా కేసులో దోషిగా మేథా పాట్కర్

పరువు నష్టం దావా కేసులో దోషిగా మేథా పాట్కర్

పరువు నష్టం దావా కేసులో నర్మదా బచావో యాక్టివిస్ట్ మేథా పాట్కర్ ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా వేసిన పరువు నష్టం కేసులో రాజకీయవేత్త, కార్యకర్త మేధా పాట్కర్‌ను ఢిల్లీ కోర్టు శుక్రవారం దోషిగా తీర్పునిచ్చింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే వీకే సక్సేనా ప్రతిష్టకు భంగం కలిగించే ఆరోపణలు చేసిందని తీర్పు ను ప్రకటించింది. చట్టం ప్రకారం.. ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ శిక్షగా విధించవచ్చు.

నర్మదా బచావో ఆందోళన్ (NBA)కి వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించినందుకు పాట్కర్ పై ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, అప్పటి అహ్మదాబాద్‌కు చెందిన NGO, నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధినేత వీకే సక్సెనా పరువు నష్టం దావా వేశారు. ఒక టీవీ ఛానెల్‌లో తనపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు, పరువు నష్టం కలిగించే పత్రికా ప్రకటన జారీ చేసినందుకు ఆమెపై రెండు కేసులు కూడా నమోదు చేశారు. 

మరోవైపు 2002లో సబరమతి ఆశ్రమంలో సామాజిక కార్యకర్తపై దాడి చేసిన వారిలో వికె సక్సేనాతో పాటు మరో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేత నిందితులుగా ఉన్నారు. అప్పటినుంచి కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. పాట్కర్‌పై దాడికి సంబంధించిన కేసు తదుపరి చర్యలపై మధ్యంతర స్టే జారీ చేయడం ద్వారా సక్సేనాకు గత ఏడాది గుజరాత్ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కలిగించింది.

నర్మదా బచావో ఆందోళన్ కేసులో నిందితులు మేథాపాట్కర్, ఫిర్యాదుదారుని ప్రతిష్టకు హాని కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగానే  ఆరోపణలను ప్రచురించారని, IPC సెక్షన్ 500 ప్రకారం శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని మేజిస్ట్రేట్ శర్మ తీర్పునిచ్చారు. దీంతో మేథా పాట్కర్ కు రెండేళ్ల జైలు శిక్ష, లేదా జరిమానా లేదా రెండూ శిక్షగా పడే అవకాశం ఉంది.