ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్: పోస్టల్ బ్యాలెట్‌పై సంచలన నిర్ణయం

ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్: పోస్టల్ బ్యాలెట్‌పై సంచలన నిర్ణయం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా ప్రకటించారు. ఫిబ్రవరి 8న ఎన్నికలు నిర్వహించి, కౌంటింగ్ ఫిబ్రవరి 11న చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. నేటి నుంచే ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని చెప్పారు. జనవరి 6 వరకు ఢిల్లీలో నమోదైన ఓటర్లు కోటి 46 లక్షల 92 వేల 136 మంది ఉన్నారని సునీల్ అరోరా చెప్పారు. మొత్తం 13,750 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తామన్నారు.

ఏ ఒక్క ఓటూ మిస్ అవ్వొద్దు.. సామాన్యుడికీ పోస్టల్ బ్యాలెట్

ఈ ఎన్నికల్లో తొలిసారి పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది ఈసీ. ఇప్పటి వరకు కేవలం ఎన్నికల విధుల్లో ఉండేవారికి మాత్రమే అవకాశం కల్పించే ఈ విధానంలో మార్పులు చేసింది. దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు కూడా పోస్టల్ బ్యాలెట్ వాడుకునేలా కొత్త పద్ధతిని ప్రవేశ పెడుతోంది. శరీరక ఇబ్బందులు, అనివార్య కారణాల వల్ల పోలింగ్ బూత్ వద్దకు రాలేని వాళ్ల ఓటు కూడా మిస్ కాకూడదన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని సీఈసీ అరోరా చెప్పారు.

షెడ్యూల్‌కు ముందే ఎన్నికల వేడి

2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాల్లో 67 సొంతం చేసుకుని, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ రెండోసారి సీఎం పీఠం దక్కించుకున్నారు. బీజేపీకి మూడు స్థానాలు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 22న ముగియబోతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఇవాళ వచ్చినప్పటికే, దేశ రాజధానిలో ముందు నుంచే పొలిటికల్ హీట్ ఉంది.  ఓ వైపు సీఏఏపై కాంగ్రెస్, ఆప్ వ్యతిరేకత, జేఎన్‌యూ, జామియా వర్సిటీల్లో నిరసనలు జరుగుతున్నాయి. మరోవైపు సీఎం కేజ్రీవాల్ మహిళలను ఆకట్టుకునేందుకు దాదాపు రెండు నెలల క్రితం నుంచే వరాలు ప్రకటిస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ వాటిలో ఒకటి. ఇక బీజేపీ కూడా ఎన్నికల రేసులో దూసుకెళ్తోంది. ఢిల్లీలో అనధికార కాలనీల్లో నివసిస్తున్న 40 లక్షల మందికి రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తామని కేంద్రం అక్టోబర్ చివరి వారంలో ప్రకటించింది. బీజేపీ, ఆప్ ఇప్పటికే ప్రచార సభలు కూడా మొదలు పెట్టాయి. ఇటీవలే ఒక్కో రాష్ట్రంలో పుంజుకుంటున్న కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలపై గట్టిగానే దృష్టి పెట్టింది.

ఢిల్లీ అసెంబ్లీ షెడ్యూల్ ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్: జనవరి 14

నామినేషన్ గడువు: జనవరి 21

నామినేషన్ల పరిశీలన: జనవరి 22

నామినేషన్ల విత్ డ్రా గడువు: జనవరి 24

పోలింగ్: ఫిబ్రవరి 8

రిజల్ట్ డే: ఫిబ్రవరి 11

More News:

మున్సిపల్ ఎన్నికల్లో వాళ్లతోనే జతకడతాం

మోడీ అండతో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి