
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఇన్ స్టిట్యూట్ లో 17 మంది విద్యార్థినులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వయంప్రకటిత స్వామి చైతన్యానంద సరస్వతి (62) ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆగ్రాలోని ఓ హోటల్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కస్టడీ కోసం నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడి నుంచి ఒక ఐప్యాడ్, మూడు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆ ప్రైవేటు ఇన్ స్టిటూట్ లోని క్యాంపస్, హాస్టల్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ఒక ఫోన్ కు అనుసంధానించారు. దీంతో హాస్టల్, క్యాంపస్ లో విద్యార్థినుల కదలికలను నిందితుడు మానిటర్ చేస్తున్నాడు.
అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అతను బృందావన్ లోని వేర్వేరు ప్రదేశాల్లో దాక్కున్నాడని, తరచూ హోటళ్లు మారాడని పోలీసులు తెలిపారు. తనను గుర్తించకుండా ఉండేందుకు పలు చీప్ హోటళ్లలో కూడా దాక్కున్నాడని వెల్లడించారు.