Olympic winners: ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్స్‌కు రూ.7 కోట్లు.. గ్రూప్ A ఉద్యోగాలు: ఢిల్లీ గవర్నమెంట్

Olympic winners: ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్స్‌కు రూ.7 కోట్లు.. గ్రూప్ A ఉద్యోగాలు: ఢిల్లీ గవర్నమెంట్

లాస్ ఏంజిల్స్‌లో 2028 లో జరగబోయే ఒలింపిక్స్ క్రీడల్లో విజయం సాధించిన వారికి ఢిల్లీ గవర్నమెంట్ మూడు సంవత్సరాల ముందుగానే నజరానా ప్రకటించింది. ఢిల్లీ ఒలింపిక్ క్రీడల విజేతలకు నగదు బహుమతిని భారీగా పెంచడం విశేషం. ముఖ్యమంత్రి ఖేల్ ప్రోత్సాహన్ యోజన కింద ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం (జూలై 22) జరిగిన క్యాబినెట్ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీ తరపున ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన విజేతకు రూ.7 కోట్లు నజరానాను ప్రకటించారు. అంతేకాదు బంగారు పతకం సాధించిన అథ్లెట్లకు గ్రూప్ A ఉద్యోగాలు లభించనున్నాయి. 

సిల్వర్ మెడల్  విజేతలకు రూ. 5 కోట్లు.. కాంస్య పతక విజేతలకు రూ. 3 కోట్లు అందజేయబడతాయి. సిల్వర్, కాంస్య విభాగాల్లో విజయం సాధించిన వారికి గ్రూప్ B ఉద్యోగాలు లభిస్తాయి. గతంలో ఒలింపిక్, పారాలింపిక్ పతక విజేతలకు గోల్డ్ మెడల్ విజేతకు రూ. 3 కోట్లు, సిల్వర్ మెడల్ విజేతకు రూ.2 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ. 1 కోటి చొప్పున బహుమతి ఇచ్చేవారు. గత ఏడాది 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో  భారత్‌ తరఫున 16 క్రీడాంశాల్లో 117 మంది పోటీపడగా.. కనీసం 10 నుంచి 15 పతకాలైనా వస్తాయని అభిమానులు ఆశించారు. కానీ, అభిమానుల ఆశలు ఫలించలేదు. ఊరించి ఊరించి చివరికి ఆరు పతకాలతో సరిపెట్టుకుంది మన దేశం. ఇందులో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకం ఉన్నాయి. 

పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మొత్తం ఆరు పతకాలు సాధించగా, అందులో మూడు షూటింగ్‌లో వచ్చినవే. అయితే, అత్యుత్తమ మెడల్ రజతం.. పురుషుల జావెలిన్ విభాగంలో వచ్చింది.  40 స్వర్ణాలతో చైనా, అమెరికా దేశాలు సమంగా ఉన్నప్పటికీ, ఎక్కువ రజత పతకాల ఆధారంగా అమెరికన్లు టాప్‌లో నిలిచారు. ఈసారి విశ్వక్రీడల్లో వందకు పైగా ఒలింపిక్ పతకాలు సాధించిన ఏకైక దేశం.. అమెరికా(40 గోల్డ్+ 44 సిల్వర్+ 42 బ్రాంజ్= 126 పతకాలు) మాత్రమే. ఈ ఒలింపిక్స్‌ క్రీడల్లో 91 పతకాలతో డ్రాగన్ దేశం చైనా(40 గోల్డ్) రెండో స్థానంలో ఉండగా.. జపాన్(20 గోల్డ్), ఆస్ట్రేలియా(18 గోల్డ్) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ పతకాల పట్టికలో భారత్ 71వ స్థానంలో నిలిచింది.

►ALSO READ | IND vs ENG 2025: రేపే ఇండియా, ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్.. ఊహించని విధంగా ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్!