నటుడు నాగార్జున ఫొటోలను వాడుకునే హక్కు ఎవరిచ్చారు?..నటుడి పిటిషన్‌‌పై ప్రతివాదులకు ఢిల్లీ హైకోర్టు ప్రశ్న

నటుడు నాగార్జున ఫొటోలను వాడుకునే హక్కు ఎవరిచ్చారు?..నటుడి పిటిషన్‌‌పై ప్రతివాదులకు ఢిల్లీ హైకోర్టు ప్రశ్న

న్యూఢిల్లీ, వెలుగు: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ఫొటోలను వాణిజ్యపరంగా వాడుకోవడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆయన పేరు, చిత్రాలతో టీ -షర్టులను విక్రయించే హక్కు ఎవరిచ్చారని ప్రతివాదులను ప్రశ్నించింది. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌‌పై మంగళవారం జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రతివాది మర్చండైజ్ వ్యాపారి తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ.. నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమాకు తాము అధికారిక మర్చండైజింగ్ భాగస్వాములమని కోర్టుకు నివేదించారు.

దీంతో తమను కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనిపై నాగార్జున న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన అగ్రిమ్మెంట్ డాక్యుమెంట్స్ అడిగినప్పటికి వారు సమర్పించలేదని తెలిపారు. వ్యాపారి లాయర్‌‌‌‌ మాట్లాడుతూ.. తమ ‘వాల్స్ అండ్ ట్రెండ్స్’అనే మార్కెటింగ్ ఏజెన్సీకి ప్రొడక్షన్ హౌస్‌‌తో ఒప్పందం ఉందని వాదించారు. తమకు ఒక అవకాశం ఇస్తే ఆధారాలు చూపుతామని రిక్వెస్ట్ చేశారు.ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న బెంచ్ విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.