- అనుమతి లేకుండా తన ఫొటోలు వాడుతున్నారంటూ ఫిర్యాదు
న్యూఢిల్లీ, వెలుగు: తన వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలంటూ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ తుషార్ రావు గెదెల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. జస్టిస్ తుషార్ రావు నటుడి నివాసం ఉంటున్న తెలంగాణకు, ఢిల్లీకి మధ్య ఉన్న భౌగోళిక దూరాన్ని ప్రస్తావించారు. ‘ఢిల్లీకి, తెలంగాణకు మధ్య ఐదు రాష్ట్రాలు ఉన్నాయి కదా? మీరు ఇక్కడి వరకు (ఢిల్లీ హైకోర్టుకు) ఎందుకు వచ్చారు’ప్రశ్నించారు. దీనిపై అల్లు అర్జున్ న్యాయవాది స్పందిస్తూ.. హక్కుల ఉల్లంఘన కేవలం ఒక్క చోట కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతోందని, అందుకే ఇక్కడి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని బదులిచ్చారు.
ఒక మొబైల్ యాప్ యజమాని అల్లు అర్జున్ పోలికలతో ఉన్న ఏఐ ప్రతిరూపాన్ని సృష్టించి, దానితో మాట్లాడే సౌకర్యాన్ని కల్పించారన్నారు. ‘ఫేక్ కాల్ పుష్ప’అనే యాప్ ద్వారా అల్లు అర్జున్ ముఖంతో వీడియో కాల్స్ చేసే సౌకర్యం కూడా ఏర్పాటు చేశారన్నారు. అల్లు అర్జున్ తన పేరు, సంతకంతో సహా మొత్తం 26 అంశాలను ట్రేడ్‌మార్క్ చేయించుకున్నారని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అనుమతి లేకుండా అల్లు అర్జున్ పేరు, ఫొటోలు వాడొద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

