ఢిల్లీలో మరో ‘1984’ జరగనివ్వం: ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీలో మరో ‘1984’ జరగనివ్వం: ఢిల్లీ హైకోర్టు

‘‘మరో ‘1984’ జరిగేందుకు ఆస్కారం ఇవ్వొద్దు. ముఖ్యంగా కోర్టు, మీ (ఢిల్లీ పోలీస్) పర్యవేక్షణలో అలా జరగనివ్వొద్దు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి” అని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఒక్క ఢిల్లీలోనే 3 వేల మంది చావులకు కారణమైన 1984 అల్లర్లను ప్రస్తావిస్తూ ఈ కామెంట్లు చేసింది. అప్పటి పరిస్థితి ఇప్పుడు రాకుండా అలర్ట్​గా ఉండాలని అధికారులను ఆదేశించింది. సీఏఏ (సిటిజన్​షిప్​అమెండ్​మెంట్ యాక్ట్) వ్యతిరేక, అనుకూల ఆందోళన తీవ్ర హింసకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈశాన్య ఢిల్లీ గొడవల్లో గాయపడ్డ వారిని తరలించేందుకు పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని ప్రశంసించింది. అర్ధరాత్రి సమయంలోనే ఆదేశాలిచ్చామని.. పోలీసులు ఆ వెంటనే అమలు చేశారని.. గాయపడ్డవారిని రక్షించారని చెప్పింది. ఐబీ ఆఫీసర్​ను చంపడం దురదృష్టకరమని జస్టిస్ ఎస్.మురళీధర్, జస్టిస్ అనూప్ జె.భంభణిల బెంచ్ విచారం వ్యక్తం చేసింది. విక్టిమ్స్, దర్యాప్తు సంస్థల మధ్య కో ఆర్డినేషన్​కు అడ్వొకేట్ జుబేదా బేగమ్​ను అమికస్ క్యూరీగా నియమించింది. ట్రామా స్ర్టెస్​తో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించేందుకు క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్​ను ఏర్పాటు చేయాలని ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, అల్లయిడ్ సైన్సెస్ (ఐహెచ్​బీఏఎస్) డైరెక్టర్​ను ఆదేశించింది. ఢిల్లీలో జరుగుతున్న గొడవల్లో ఇప్పటిదాకా ఢిల్లీ పోలీస్ ఆఫీసర్, ఐబీ ఆఫీసర్ సహా 27 మంది చనిపోగా.. 200 మందికి పైగా గాయపడ్డారు.

అర్ధరాత్రి ఫోన్ కాల్.. ప్రత్యేక విచారణ

చిన్న ఆస్పత్రి నుంచి జీటీబీ(గురు తేజ్ బహదూర్) ఆసుపత్రికి బాధితులను తరలించడం సాధ్యం కావడం లేదంటూ అడ్వొకేట్ సరూర్ మందర్ నుంచి జస్టిస్​మురళీధర్​కు మంగళవారం రాత్రి కాల్ వచ్చింది. దీంతో జస్టిస్​మురళీధర్ తన ఇంట్లో అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రత్యేక విచారణ చేపట్టారు. బాధితులను తరలించేందుకు, ఎమర్జెన్సీ ట్రీట్​మెంట్ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని వెంటనే పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు మొత్తం బలగాలను మోహరించాలని, జీటీబీ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు వీలు కాకపోతే.. లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్, లేదా మౌలానా ఆజాద్ ఆస్పత్రి లేదా ఇంకేదైనా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. గాయపడ్డ వారు ఎంత మంది? వారికి ఎలాంటి ట్రీట్​మెంట్ ఇచ్చారు? తదితర వివరాలతో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని అధికారులను
ఆదేశించారు.

డాక్టర్​కు ఫోన్ చేసి..

న్యూ ముస్తఫాబాద్​లోని అల్ హింద్ ఆస్పత్రి డాక్టర్ అన్వర్​తో జడ్జిలు ఫోన్​లో మాట్లాడారు. ఆస్పత్రిలో రెండు డెడ్ బాడీలు ఉన్నాయని, 22 మంది గాయపడ్డ వారు ఉన్నారని కోర్టుకు ఆయన తెలిపారు. పోలీసుల సాయం కోసం మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రయత్నిస్తున్నానని, కానీ ఎలాంటి స్పందన లేదని వివరించారు. దీంతో కోర్టు వెంటనే ఆస్పత్రి దగ్గరకు వెళ్లాలని పెద్దాఫీసర్లకు ఆర్డర్లు ఇచ్చింది. అక్కడికి వెళ్లిన అధికారులు.. బాధితులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. జడ్ కేటగిరీ భద్రత ఉన్న ప్రజాప్రతినిధులు.. బాధితులను పరామర్శించేందుకు వెళ్లాలని, చట్టం పనిచేస్తున్నదన్న కాన్ఫిడెన్స్​ను వాళ్లలో నింపాలని సూచించింది.

కపిల్ మిశ్రా వీడియో ప్లే చేయండి

విద్వేష వ్యాఖ్యలు చేసిన కపిల్ మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, హింసకు కారణమైన వారిని అరెస్టు చేయాలని దాఖలైన పిటిషన్​పై కోర్టు విచారణ జరిపింది. కపిల్ మిశ్రాకు సంబంధించిన వీడియోను చూశారా? అని ఢిల్లీ పోలీసుల తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను, పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. తాను టీవీ చూడనని మోహతా సమాధానమిచ్చారు. ‘‘కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ.. విద్వేష వ్యాఖ్యలు చేశారు. కానీ కపిల్ మిశ్రా అలా మాట్లాడలేదు” అని ఓ పోలీసు అధికారి వివరించారు. దీంతో కోర్టు సీరియస్ అయింది. ‘‘ఢిల్లీ పోలీసుల వ్యవహారాలను చూసి నిజంగా ఆశ్చర్యపోతున్నా.. కపిల్ మిశ్రా వీడియో​క్లిప్​ను ప్లే చేయండి” అని కోర్టు సిబ్బందిని జస్టిస్ మురళీధర్ ఆదేశించారు. తర్వాత కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్‌, అభయ్ వర్మ, పర్వేశ్ వర్మల వీడియో క్లిప్​లను కోర్టులో ప్లే చేశారు. విద్వేష వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి లేట్ చేయొద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఇలాంటి విషయాల్లో పోలీసులు నెమ్మదిగా స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి

విద్వేష వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. బుధవారం జస్టిస్ మురళీధర్, జస్టిస్ తల్వంత్ సింగ్​ల బెంచ్ విచారణ జరిపింది. పోలీస్ కమిషనర్​తో భేటీ అవుతానని, వీడియో క్లిప్​లను చూస్తానని, సరైన నిర్ణయం తీసుకుంటానని స్పెషల్ కమిషనర్ ప్రవీర్ రంజన్ ఇచ్చిన హమీని కోర్టు నోట్ చేసుకుంది. అలాగే కేసులో ప్రతివాదాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ గురువారం జరపనుంది.

అల్లర్లపై 18 ఎఫ్​ఐఆర్​లు

ఈశాన్య ఢిల్లీ ప్రశాంతంగా ఉందని డిప్యూటీ పోలీస్​ కమిషనర్​ (సౌత్​ఈస్ట్​) మన్​దీప్​ రంధావా చెప్పారు.  ఈనెల 23 నుంచి అట్టుడికిన నార్త్​ఈస్ట్​ ఢిల్లీలో బుధవారం ఒక్క అవాంఛనీయ సంఘటనా జరగలేదని మీడియాకు తెలిపారు.  అల్లర్లకు సంబంధించి 18 ఎఫ్​ఐఆర్​లు నమోదుచేసినట్టు చెప్పారు.   చాంద్​బాగ్​, మౌజ్​పూర్, జఫ్రాబాద్​లాంటి ప్రాంతాల్లో 106 మందిని అరెస్టు చేశామన్నారు. అల్లర్లలో గాయపడ్డవారు గురు తేజ్‌ బహదుర్​ హస్పిటల్​, ఎల్​ఎన్​జేపీ హాస్పిటల్​, రామ్​మనోహర్​లోహియా హాస్పిటల్​, ఇతర హెల్త్​కేర్​ సెంటర్లలో ట్రీట్​మెంట్ ​తీసుకుంటున్నారు.

సెక్యూరిటీ సిబ్బంది ఫ్లాగ్​ మార్చ్

ఢిల్లీలో అల్లర్లు జరిగిన  చాంద్​ బాగ్​, జఫ్రాబాద్​, భజన్​పురా, యమునా విహార్​, మౌజ్​పూర్​లో   సెక్యూరిటీ ఫోర్స్​ బుధవారం ఫ్లాగ్​ మార్చ్​ జరిపింది.  ఈ ఏరియాల్లోని  షాపులు, స్కూళ్లు మూతపడ్డాయి.  వీధుల్లో జనసంచారం లేదు.  చాంద్​బాగ్​లో పెద్ద ఎత్తున ఫోర్స్​ను దింపారు.ఈ ఏరియాలో రోడ్లమీదకు రావడానికి  జనాన్ని   అనుమతించడంలేదు.   సెక్యూరిటీ కోసం కొన్ని దారుల్ని తామే మూసేశామని స్థానికులు చెప్పారు.