కారులో ఒంటరిగా వెళ్లినా మాస్కు పెట్టుకోవాల్సిందే

కారులో ఒంటరిగా వెళ్లినా మాస్కు పెట్టుకోవాల్సిందే

కరోనా నిబంధనలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. ఒక వ్యక్తి కారులో ఒంటరిగా ప్రయాణించినా సరే మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలని ఆదేశించింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీలో మాస్కులు పెట్టుకొని వాళ్లకు పోలీసులు ఫైన్లు విధిస్తున్నారు. కార్లలో ఒంటరిగా వెళ్లే వాళ్లకు కూడా ఫైన్లు విధించడంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. పైగా పోలీసుల తీరును సమర్థించింది. ‘మీరు కారులో ఒంటరిగా వెళ్లినా.. మాస్కు ధరించడానికి ఇబ్బంది ఏంటి? అది మీ మంచి కోసమే కదా.. కరోనా తీవ్రత పెరిగింది. కరోనాను కంట్రోల్ చేయాలంటే మాస్కు ధరించడమే మార్గం. మీరు మాస్కు పెట్టుకోకుండా కారులో వెళ్తూ.. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు విండో తీస్తారు. అలా కరోనా పక్కనున్న వారికి వ్యాప్తి చెందొచ్చు. అందుకే కారులో ఉన్నా మాస్కు పెట్టుకోవాలి’ అని వ్యాఖ్యానించింది. 

కాగా.. కారులో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తి మాస్కు ధరించాలని రూల్ లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది. కానీ, ప్రతి రాష్ట్రానికి  సొంతంగా నియమాలను రూపొందించుకోవడానికి మరియు వాటిని అమలు చేయడానికి హక్కు ఉందని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.