మనోళ్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వనేలేదు.. వేరే దేశాలకా?

మనోళ్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వనేలేదు.. వేరే దేశాలకా?

కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు

వ్యాక్సినేషన్‌‌‌‌కుట్స్ ఎందుకు.. అఫిడవిట్ ఫైల్ చేయండి

మాన్యుఫాక్చరింగ్ కెపాసిటీ తెలియజేయాలని సీరం, భారత్ బయోటెక్‌‌‌‌కు ఆదేశం

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ముందుగా మన దేశ ప్రజలందరికీ ఇవ్వకుండా.. విదేశాలకు ఎందుకు ఎక్స్ పోర్టు చేస్తున్నారని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎందుకు కంట్రోల్ చేస్తున్నారని, వ్యాక్సిన్ కోసం ప్రజలను వివిధ వర్గాలుగా విభజించడం ఎందుకని అడిగింది. వ్యాక్సిన్ ను ఓవైపు విదేశాలకు ఎక్స్ పోర్టు చేస్తూ, మరోవైపు మన దేశంలో వ్యాక్సినేషన్ కు పరిమితులు విధించడం ఎందుకని నిలదీసింది. కేంద్రం కరోనా వ్యాక్సిన్లను విదేశాలకు డొనేట్, ఎక్స్ పోర్టు చేయడంపై హైకోర్టు ఈ కామెంట్లు చేసింది. న్యాయ వ్యవస్థ పరిధిలో పని చేస్తున్నోళ్లందరినీ ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించాలని ఢిల్లీ బార్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. అప్పుడే వారికి ఎలాంటి ఏజ్, ఫిజికల్ కండిషన్ లిమిట్స్ లేకుండా వ్యాక్సిన్ అందుతుందని లెటర్ రాసింది. దీన్ని కోర్టు సుమోటో పిల్ గా స్వీకరించగా.. జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖ పల్లిలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది.

అత్యవసరమని గుర్తించండి..

కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను తయారు చేస్తున్న సీరం, భారత్ బయోటెక్ సంస్థల తయారీ సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ, అవి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నట్లుగా కనిపించడం లేదని బెంచ్ పేర్కొంది. ‘‘ఈ సంస్థల కెపాసిటీని మనం పూర్తిగా వినియోగించుకోవడం లేదు. తయారు చేసిన వ్యాక్సిన్‌‌లలో కొన్నింటిని విదేశాలకు డొనేట్, ఎక్స్ పోర్టు చేస్తున్నాం. కానీ మన దేశ ప్రజలందరికి మాత్రం అందించలేకపోతున్నాం. వ్యాక్సిన్ అందరికీ అత్యవసరమని, అందజేయడం తమ బాధ్యతని కేంద్రం గుర్తించాలి” అని బెంచ్ కామెంట్ చేసింది. వ్యాక్సిన్ మాన్యుఫాక్చరింగ్ కెపాసిటీ తెలియజేయాలని సీరం, భారత్ బయోటెక్ సంస్థలను ఆదేశించింది.

ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పెద్దలకు ప్రాధాన్యం ఇవ్వండి: సుప్రీం

కరోనా నేపథ్యంలో ట్రీట్ మెంట్, అడ్మిషన్లకు సంబంధించి సీనియర్ సిటిజన్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రైవేట్ హాస్పిటళ్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతకుముందు కేవలం గవర్నమెంట్ హాస్పిటళ్లకు మాత్రమే ఆదేశాలిచ్చిన సుప్రీం.. 2020 ఆగస్టు 4న ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేస్తూ, కొత్తగా ఆర్డర్ ఇచ్చింది. సీనియర్ లాయర్ అశ్వని కుమార్ ఫైల్ చేసిన పిటిషన్ పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డిల డివిజన్ బెంచ్ గురువారం మరోసారి విచారణ చేపట్టింది. తన పిటిషన్ పై సుప్రీం గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలపై ఒడిశా, పంజాబ్ మాత్రమే వివరాలిచ్చాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సుప్రీం.. మిగతా రాష్ట్రాలకు మూడు వారాల గడువు ఇచ్చింది.