Delhi Liquor Scam: సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

Delhi Liquor Scam: సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా మద్యం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనీశ్ సిసోడియా బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్ పై విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. ఏప్రిల్ 5కు వాయిదా చేసినట్లు మార్చి 25 శనివారం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈడీ అధికారులు రోజూ గంటల పాటు మనీశ్ సిసోడియాను విచారిస్తున్నారు. అటు కోర్టు కూడా ఆయన కస్టడీ గడువును పెంచుతూ పోతోంది. 

కీలక వివరాలు సిసోడియా చెప్పడం లేదని, విచారణకు సహకరించడం లేదని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే సిసోడియా మాత్రం తాను అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబుతున్నట్టు వివరిస్తున్నారు. రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వేశారు. దీనిపై విచారణ జరగలేదు. కస్టడీని పొడిగిస్తోందే తప్ప ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదు కోర్టు. స్పెషల్ జడ్జ్ నాగ్‌పాల్‌ శనివారం జరగాల్సిన ఈ విచారణను వాయిదా వేశారు. దీనిపై ఈడీ వివరణ ఇచ్చిన తరవాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.