ఢిల్లీలో డబ్బు కోసం గొడవ పడి కుటుంబ సభ్యులపై దాడి

ఢిల్లీలో డబ్బు కోసం గొడవ పడి కుటుంబ సభ్యులపై దాడి
  • కొద్ది రోజుల కిందే రిహాబిలిటేషన్ నుంచి ఇంటికి..
  • డబ్బు కోసం గొడవ పడి కుటుంబ సభ్యులపై దాడి
  • కత్తితో పొడవడంతో తల్లిదండ్రులు, చెల్లెలు, నాయనమ్మ మృతి
  • నిందితుడికి మరణశిక్ష విధించాలని బంధువుల డిమాండ్
  • ఢిల్లీలో డ్రగ్ అడిక్ట్  బీభత్సం

న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ దారుణ హత్య ఘటన మరువక ముందే ఢిల్లీలో మరో దారుణం జరిగింది. సొంత కుటుంబ సభ్యులందరినీ ఓ యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఇల్లంతా రక్తసిక్తం చేశాడు. నైరుతి ఢిల్లీలోని పాలంలో మంగళవారం రాత్రి 10.30 గంటలకు ఓ బిల్డింగ్ లోని అప్పర్ ఫ్లోర్ లో ఈ ఘోరం జరిగింది. కేశవ్ అనే వ్యక్తి డ్రగ్స్ కు బానిసగా మారడంతో అతని కుటుంబ సభ్యులు ఓ డ్రగ్ రిహాబిలిటేషన్ లో చేర్పించారు. చికిత్స తర్వాత కేశవ్ తన ఇంటికి తిరిగివెళ్లాడు. డ్రగ్స్ కోసం డబ్బులు కావాలంటూ కుటుంబ సభ్యులను వేధించడం ప్రారంభించాడు. మంగళవారం రాత్రి తన తల్లి దర్శనతో డబ్బు కోసం గొడవపడ్డాడు. కుటుంబ సభ్యులు నచ్చచెప్పినా వినలే. ఇంతలోనే విచక్షణ కోల్పోయి తల్లి దర్శన, తండ్రి దినేష్ (50), సోదరి ఊర్వశి(18), నాయనమ్మ దేవానా దేవి(75) ని కేశవ్ కత్తితో పొడిచి చంపాడు. కుటుంబ సభ్యుల  అరుపులు విన్న బంధువులు, పొరుగువారు వెళ్లి తలుపు తీయాలంటూ వేడుకున్నా లాభంలేకపోయింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని కుల్దీప్ సైనీ అనే దగ్గరి బంధువు పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. తర్వాత తలుపులు తెరిచి చూడగా నలుగురు కుటుంబ సభ్యులు అప్పటికే చనిపోయారు.

జైలు నుంచి వచ్చాక నిన్నూ చంపేస్తా..

పోలీసుల వెంట వెళుతూ కేశవ్​ తనను కూడా బెదిరించాడని సైనీ చెప్పారు. ‘జైలు నుంచి బయటకు వచ్చాక నీ సంగతి చూస్తా’ అని బెదిరించాడని వివరించారు. మరోవైపు, కేశవ్ సృష్టించిన బీభత్సంతో అతని బంధువులు దిగ్ర్భాంతికి గురయ్యారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కేశవ్​కు  నేరచరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. ఏటీఎం రాబరీ కేసులో అరెస్టయి జైలుకెళ్లాడని చెప్పారు.