
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తనతో శారీరకంగా కలవడానికి నిరాకరించిందని 37 ఏళ్ల మహిళను ఆమె స్నేహితుడు దారుణంగా హత్య చేశాడు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్ ఆలం, జర్నా అనే ఇద్దరు పుల్ పెహ్లాద్ పూర్‌లోని క్లాత్ ఎక్స్ పోర్టు కంపెనీలో పనిచేసేవారు. దాంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది కాస్తా బంధానికి తెరలేపింది. దాంతో వారిద్దరూ మరింత సన్నిహితులుగా మారారు. ఈ క్రమంలో చాంద్.. జర్నాకు ప్రతి నెలా రూ. 6 వేలు ఖర్చులకు ఇస్తున్నాడు. అయితే ఈ మధ్య జర్నా.. సూరజ్ అనే వ్యక్తితో స్నేహం చేస్తున్నట్లు ఆలంకు తెలిసింది. ఈ విషయంలో ఆలం.. జర్నాతో గొడవపడి ఆమెకు డబ్బులు ఇవ్వడం మానేశాడు. కొన్ని రోజుల తర్వాత.. నవంబర్ 21న బదర్‌పూర్ బస్ స్టాప్‌లో జర్నాను చాంద్ ఆలం కలుసుకున్నాడు. ఆమెను ఓఖ్లా తెహ్‌ఖండ్‌లోని రైల్వే ట్రాక్ సమీపంలోని పాడుబడిన క్వార్టర్‌కి తీసుకెళ్లాడు. అక్కడ బాధితురాలిని తనతో శారీరకంగా కలవాలని బలవంతం చేశాడు. అందుకు జర్నా ఒప్పుకోకపోవడంతో.. ఆమె బ్యాగ్‌లోని కత్తెరతో మెడపై పొడిచాడు. ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్ తో కప్పి.. ఆమె ఫోన్‌ను రాయితో పగలగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ.. కత్తెరను, రక్తంతో తడిసిన బట్టలను నాలాలో పడేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. చాంద్ ను అదుపులోకి తీసుకున్నారు.