
న్యూఢిల్లీ: చైనీస్ మాంజా విక్రయాలపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే చైనీస్ మాంజాలను అమ్ముతున్న 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 25న హైదర్ పూర్ ఫ్లై ఓవర్ మీదుగా బైక్ పై వెళ్తున్న ఓ యువకుడి మెడకు మాంజా అడ్డుపడటంతో అతడి గొంతుకు తీవ్ర గాయమైంది. అతడ్ని హాస్పిటల్ కు తరలించగా... అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో అక్రమంగా మాంజా అమ్ముతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మాంజా విక్రయ స్థావరాలపై ముమ్మర దాడులు చేస్తున్నట్లు అవుటర్ ఢిల్లీ డీసీపీ సమీర్ శర్మ తెలిపారు. దీనికోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్న ఆయన... 11మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 59 చైనీస్ మాంజా రోల్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
అదే విధంగా నార్త్ వెస్ట్ ఢిల్లీలో కూడా అక్రమ మాంజా విక్రయాలను అరికట్టడానికి ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. నార్త్ వెస్ట్ ఢిల్లీ పోలీసుల స్పెషల్ స్టాఫ్ టీమ్ ఓ గోదాముపై దాడి చేసి 11,760 చైనీస్ మాంజా రోల్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో అమర్జీత్ అనే మాంజా డీలర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్జీత్ ఒక కోడ్ వర్డ్ ద్వారా దుకాణదారులకు చైనీస్ మాంజాను సరఫరా చేసేవాడని నార్త్ వెస్ట్ ఢిల్లీ డీసీపీ ఉషా రంగ్ నాని తెలిపారు.
మోనో కైట్ మాంజా బ్రాండ్ పేరుతో 400 చైనీస్ మాంజా కార్టన్‌లను నోయిడాలోని ఒక డీలర్ నుండి నెల రోజుల క్రితం కొనుగోలు చేసినట్లు అమర్జీత్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ మాంజా సూరత్ నుంచి ట్రక్కులో ఢిల్లీకి వచ్చినట్లు తెలిపాడు. అమర్జీత్ మాంజాను అద్దెకు తీసుకున్న ఓ గోడౌన్‌లో నిల్వ చేసి ఢిల్లీ- ఎన్‌సీఆర్‌లోని దుకాణదారులకు విక్రయిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఇది కాకుండా.. దక్షిణ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు దాడి చేసి 7 మందిని అరెస్టు చేశారు. వారి నుండి 95 చైనీస్ మాంజా రోల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా... 2017 లో చైనీస్ మాంజాపై కేంద్ర ప్రభుత్వ నిషేధం విధించింది.