ప్రెస్ మీట్లో.. కవితకు ఢిల్లీ పోలీసుల షాక్

ప్రెస్ మీట్లో.. కవితకు ఢిల్లీ పోలీసుల షాక్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు.. మార్చి 10వ తేదీ జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండగానే.. షాక్ ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. జంతర్ మంతర్ లో జరిగే దీక్షకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా.. కొంచెం స్థలాన్ని  మాత్రమే వాడుకోవాలని లేకుంటే.. వేదికను మరో చోటకు మార్చుకోవాలని సూచిస్తూ.. సమాచారం ఇచ్చారు. దీంతో కవిత ఒక్కసారిగా షాక్ అయ్యారు. జాతీయ ఛానెల్స్ సైతం లైవ్ నడుస్తున్న సమయంలోనూ.. ఈ సమాచారం రావటంతో అవాక్కయ్యారు.

ఇప్పటికే జంతర్ మంతర్ దగ్గర దీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని పార్టీలకు ఆహ్వానం పంపించారు కవిత. దేశవ్యాప్తంగా ఉన్న 29 పార్టీలకు చెందిన నేతలు హాజరవుతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. జంతర్ మంతర్ దీక్షకు.. చివరి నిమిషంలో అనుమతులు రద్దు చేయటం కలకలం రేపుతోంది. కొన్ని షరతులు విధించారు. అక్కడ ఉన్న కొంచెం స్థలాన్ని మాత్రమే వాడుకోవాలని ఆంక్షలు విధించారు. మొత్తం స్థలం ఇవ్వలేం అని.. గతంలో ఇచ్చిన అనుమతులు రద్దు చేసి.. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలీస్ షరతుల క్రమంలోనే.. దీక్ష ప్రదేశాన్ని పరిశీలించారు కవిత. ఆ కొంచెం స్థలంలోనే దీక్ష చేస్తారా లేక ప్లేస్ మార్చుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.

5 వేల మందితో సభకు అనుమతి ఇచ్చారని..  10 రోజుల క్రితమే పర్మీషన్ ఇచ్చారని స్పష్టం చేశారు కవిత. అయితే బీజేపీ వాళ్లు ధర్నాకు పర్మీషన్ కోరారని.. దీంతో జంతర్ మంతర్ లోని సగం స్ళలాన్ని మాత్రమే వాడుకోవాలంటూ సూచించినట్లు తెలిపారు. మొదట ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నట్లు తెలిపారని..దీనిపై చర్చలు జరుగుతున్నాయన్నారామె.  ఇప్పటికిప్పుడు బీజేపీ వాళ్లు సభ పెట్టుకోవటం ఏంటని ప్రశ్నిస్తూ.. ఇది కావాలనే చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు.