- ఆ పార్టీకి అంత పెద్దమొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ ఎట్లొచ్చినయ్: మంత్రి వివేక్
- సీఎం రేవంత్‌ను కలిసి విచారణ కోరుతా
- ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి రావాలి
- హెచ్‌సీఏ సహకరిస్తే ఏటా క్రికెట్ టోర్నీ నిర్వహిస్తామని వెల్లడి
- క్యాతనపల్లి సింగరేణి స్టేడియంలో కాకా మెమోరియల్ క్రికెట్ పోటీలు ప్రారంభం
కోల్‌బెల్ట్, వెలుగు: దేశంలో ఎక్కడాలేని విధంగా ఓ ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌కు వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని, దీనిపై ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌కు రూ.980 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ ఎక్కడి నుంచి? ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ ఫ్యామిలీ దోచుకొని.. వేల కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్నదని మండిపడ్డారు. బుధవారం చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో, భీమారం మండలంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. రూ.1.24 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.
రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్డిస్ట్రిక్ట్టీ20 లీగ్ రెండో దశలో భాగంగా ఖమ్మం,హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన పోటీని మంత్రి వివేక్ ప్రారంభించారు. టాస్‌వేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కొద్దిసేపు బ్యాటింగ్చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు.
కాకా టోర్నీ.. గ్రామీణ క్రీడాకారులకు అద్భుతమైన వేదికగ్రామాల్లోని ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి రావాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందుకోసం కాకా మెమోరియల్క్రికెట్ పోటీలు అద్భుతమైన వేదిక అని పేర్కొన్నారు.
గ్రామీణ క్రీడాకారులను టర్ఫ్ వికెట్లపై అడించి, వారిని జాతీయస్థాయికి సిద్ధం చేయడమే ఈ టోర్నీ లక్ష్యమని తెలిపారు. తొలిదశలో సత్తాచాటి రెండో దశకు ఎంపికైన క్రికెటర్లను అభినందించారు. తాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు తెలంగాణ టీ20లీగ్ నిర్వహించానని, ఆదిలాబాద్ టీమ్ విన్నర్‌గా నిలిచి గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ప్రతిభ దాగి ఉందో నిరూపించిందని గుర్తుచేశారు.
అప్పుడే గ్రామాల్లో టాలెంట్ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నట్టు గుర్తించామని, టర్ఫ్ వికెట్‌పై ఆడించాలనే ఆలోచన వచ్చిందన్నారు. అన్ని సౌకర్యాలతో 33 జిల్లాల్లో కాకా మెమోరియల్ టోర్నీ నిర్వహిస్తున్నామని, దీన్ని విశాక ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేస్తున్నదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 మ్యాచ్‌లలో ఇప్పటికే 80 పూర్తయ్యాయని తెలిపారు. ఈ నెల17న గ్రామీణ క్రికెటర్లకు ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆడే అవకాశాన్ని విశాక ఇండస్ట్రీస్, హెచ్‌సీఏ కల్పించాయన్నారు.
క్రికెటర్లు మున్ముందు స్టేట్ టీమ్స్‌కు, ఐపీఎల్‌కు ఆడే అవకాశం ఉందని చెప్పారు. బెస్ట్ ప్లేయర్లను సెలెక్ట్ చేసి..వారికి ప్రత్యేక కోచింగ్ ఇప్పించి ఇండియా టీమ్‌కు ఆడేలా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఉందన్నారు. హెచ్‌సీఏ అవకాశం ఇస్తే విశాక ఇండస్ట్రీస్ ప్రతి ఏటా ఈ టోర్నీకి స్పాన్సర్ చేస్తుందని పేర్కొన్నారు. కాకా వెంకటస్వామి స్ఫూర్తితోనే విశాక ఇండస్ట్రీస్ క్రీడలను ప్రోత్సహిస్తున్నదని, ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియం ఏర్పాటు కాకా తీసుకున్న చొరవకు నిదర్శనమని తెలిపారు. తెలంగాణలోని ప్రతి జిల్లాకో క్రికెట్ స్టేడియం ఉండాలన్నారు.
మంచిర్యాల జిల్లాలో స్థలం సమాకూర్చితే మంచి స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
రెండో దశ లీగ్‌లో ఖమ్మం గెలుపు
రెండో దశ క్రికెట్లీగ్ పోటీల్లో ఖమ్మం జట్టు హైదరాబాద్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ టీం 20 ఓవర్లలో 122 రన్స్‌కు ఆలౌట్ అయింది. జట్టులోని ప్రణయ్ 31 పరుగులు చేశాడు. ఖమ్మం జట్టు బౌలర్లు జి.జాషు మూడు వికెట్లు, లోకేశ్‌గౌడ్,తేజానాయుడు రెండేసి వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కుదిగిన ఖమ్మం ఉమ్మడి జిల్లా జట్టు 13 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని అక్షయ్ 54 రన్స్ చేసి జట్టు విజయానికి కృషి చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్దక్కించుకున్నాడు.
ఆస్తుల కోసం కేసీఆర్ ఫ్యామిలీ కొట్లాట
అందరం కలిసి పోరాడి తెలంగాణ సాధించుకున్నామని, కానీ..పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్లతోనే బీఆర్ఎస్ ధనిక పార్టీ అయిందన్నారు. ప్రజల సొమ్మును దండుకొని కూడబెట్టిన ఆస్తుల కోసం కేసీఆర్ఫ్యామిలీలో కొడుకు, బిడ్డ, అల్లుడు కొట్లాడుకుంటున్నారని తెలిపారు.
తన నాన్న, అన్న, బావ మధ్య ఆస్తుల గొడవ ఉందని కవిత కూడా చెప్పారని వివేక్ గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఆస్తులు,ఆ పార్టీ లీడర్ల అవినీతి,అక్రమాలపై కవిత చేస్తున్న ఆరోపణల్లో నిజనిజాలను నిగ్గు తేల్చాలన్నారు. ఈ అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతానని చెప్పారు. మహిళలను, రైతులను కోటీశ్వరులు చేస్తానని మోసం చేసి.. కేసీఆర్ కుటుంబం మాత్రం లక్ష కోట్లు సంపాదించుకున్నదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి ప్రజలు గట్టి బుద్ధిచెప్పారని వ్యాఖ్యానించారు.
