
ఢిల్లీ: రెజ్లర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌తో పాటు డబ్ల్యూఎఫ్‌ఐ సహాయక కార్యదర్శి వినోద్ తోమర్ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. ఓ మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు బ్రిజ్‌భూషణ్‌పై పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన విషయం తెలిసిందే.
విచారణకు సహకరించాలని నోటీసులు పంపిన పోలీసులు సుమారు 3 గంటల పాటు బ్రిజ్‌భూషణ్‌ను విచారించారు. లైంగిక హింస ఆరోపణలను కొట్టేసిన అతను.. తనను ఈ కేసులో కావాలనే ఇరికించారని చెప్పినట్లు సమాచారం. దీంతో అందుకు తగిన ఆధారాలను చూపించాలని అతనికి పోలీసులు స్పష్టం చేశారు. విచారణలో భాగంగా వాంగ్ములాలు, సాక్ష్యాలు సేకరించేందుకు పోలీసు బృందాలను ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, హర్యానాకు పంపించారు.
ఈ కేసు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రత్యేక న్యాయస్థానానికి శుక్రవారం (మే 12న) పోలీసులు తెలిపారు. మరోవైపు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ దగ్గర రెజ్లర్లు నిర్వహిస్తున్న ధర్నా కొనసాగుతోంది.