December 31 : 24గంటలు స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు

December 31 : 24గంటలు స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు

నూతన సంవత్సరం వేళ ఢిల్లీలోని స్టార్ హోటళ్లు, వాటిలోని బార్ అండ్ రెస్టారెంట్లకు తీపి కబురు వినిపించింది.  వాటి వ్యాపారాలకు దన్నుగా నిలిచేలా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా ఏర్పాటుచేసిన సాధికార కమిటీ కీలక నిర్ణయం ప్రకటించింది. ఢిల్లీ పరిధిలోని ఫోర్ స్టార్ హోటళ్లు,  ఫైవ్ స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లను ఇకపై 24 గంటల పాటు  తెరిచి ఉంచేలా సడలింపు కల్పించింది. విమానాశ్రయం, రైల్వే స్టేషన్, ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్ పరిధుల్లోని స్టార్ హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు కూడా ఈ సడలింపును సద్వినియోగం చేసుకోవచ్చని కమిటీ స్పష్టం చేసింది. త్రీ స్టార్ హోటళ్లలోని భోజన విభాగాలు కూడా ఇవాళ అర్ధరాత్రి 2 గంటల వరకు, మిగితా విభాగాలు అర్ధరాత్రి 1 గంట వరకు కార్యకలాపాలు కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల సానుకూల వ్యాపార వాతావరణం ఏర్పడటంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. 

మరోవైపు ఢిల్లీలో రెస్టారెంట్ లైసెన్సును పొందేందుకు సమర్పించాల్సిన ధ్రువపత్రాల జాబితా నుంచి 28 డాక్యుమెంట్లను తొలగించారు.  రెస్టారెంట్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 49 రోజుల్లోగా లైసెన్సును మంజూరు చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసే లైసెన్సుల కాల పరిమితి మూడేళ్లు.. ఢిల్లీ పోలీసు, ఫైర్ సర్వీసులు జారీ చేసే లైసెన్సుల కాల పరిమితి 9 ఏళ్లు ఉంటుంది. ఇక పోలీసుల వెరిఫికేషన్ ప్రక్రియను కూడా ఆన్ లైన్ చేశారు.