ఎండాకాలంలా.. చలికాలం సెలవులు 10 రోజులు ఇచ్చిన ప్రభుత్వం

ఎండాకాలంలా.. చలికాలం సెలవులు 10 రోజులు ఇచ్చిన ప్రభుత్వం

కాలం మారింది.. కాలంతోపాటు పిల్లల సెలవులూ మారాయి.. ఇదే ఇప్పుడు నిజం అయ్యింది. ఎప్పుడూ ఎండాకాలం సెలవులు చూసిన పిల్లలు.. ఇప్పుడు చలికాలం సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. నవంబర్ 9 నుంచి 18వ తేదీ 10 రోజులపాటు చలికాలం.. అదేనండీ శీతాకాలం సెలవులు ప్రకటించింది ఢిల్లీ సర్కార్. 

ఢిల్లీలో ఇప్పుడు చలికాలమే.. కాకపోతే పొల్యూషన్ కాలం నడుస్తుంది. ఊపిరి తీసుకోవటానికి కూడాఇబ్బంది పడేంతగా.. గాలి కాలుష్యం అయ్యింది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా జనం అంతా స్వచ్ఛమైన గాలి కోసం దేవుడిని ప్రార్థిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవటంతో.. అన్ని స్కూల్స్ కు పది రోజులు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. దీని వల్ల స్కూల్ బస్సులు రోడ్డెక్కవు.. దీంతో పొల్యూషన్ కొంత తగ్గుతుంది. అంతే కాకుండా పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. ట్రాఫిక్ కంట్రోల్ చేయటం.. వాహనాలను రోడ్డెక్కకుండా కట్టడి చేసే ఉద్దేశంతో పాటు.. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 రోజులు శీతాకాలం సెలవులు ప్రకటించింది ఢిల్లీ సర్కార్.

వాయు కాలుష్యం అప్పటికీ.. అంటే నవంబర్ 18వ తేదీకి తగ్గకపోతే.. ఈ సెలవులను మరో వారం పొడిగించే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఇచ్చిన సెలవులను.. డిసెంబర్ నెలలో ఇచ్చే క్రిస్మస్ హాలిడేస్ లో కవర్ చేస్తామని చెబుతున్నారు. ఏదిఏమైనా గాలి లేక.. పీల్చుకునే గాలి లేక ఏకంగా సెలవులు ఇచ్చే దుస్థితిని.. మన ప్రభుత్వాలు రావటం గ్రేట్ కదా...