
ఢిల్లీ ఓల్డ్ రాజేంద్రనగర్ లోని కోచింగ్ సెంటర్ ఘటనపై ఆందోళన చేపట్టారు విద్యార్థులు. భారీ వర్షాలతో ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్ మెంట్ లోకి చేరిన నీటిలో మునిగి ముగ్గురు అభ్యర్థులు చనిపోగా.. మరో 13మందిని రెస్క్యూ చేసిన సంగతి తెలిసిందే..
సిబ్బంది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ధర్నా చేపట్టారు విద్యార్థులు. ప్రభుత్వం స్పందించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పాట్ ను సందర్శించారు ఆప్ ఎంపీ స్వాతిమాలివాల్. ఘటన జరిగి 12గంటలు జరిగిన మంత్రి, మేయర్ స్పాట్ కు రాకపోవడం దారుణమన్నారు. విద్యార్థులు ఆమెకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ స్వాతి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
రాజేంద్రనగర్ ఘటనకు ఆమ్ ఆద్మీ పార్టీ కారణమని ఆరోపించారు న్యూ ఢిల్లీ బీజేపీ నేతలు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు విద్యార్థులు చనిపోయారన్నారు. ఢిల్లీలో పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. డ్రైనేజీని క్లీన్ చేయకపోవడంతోనే వరద నీరు బేస్ మెంట్లో నిలిచిపోయిందన్నారు ఢిల్లీ బీజేపీ స్టేట్ చీఫ్ వీరేంద్ర సచ్ దేవ్. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతిపై సైతం విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రమాదంపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు ఢిల్లీ మంత్రి ఆతిషి. 24గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలని ట్వీట్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక మరోవైపు ఢిల్లీలోని అన్ని కోచింగ్ సెంటర్లలోని బేస్ మెంట్లో ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాటిపై చర్యలు ఆదేశించారు మేయర్ షెల్లి ఒబేరాయ్.
బేస్ మెంట్లోని వరదలో మునిగి చనిపోయిన వారిలో తెలంగాణకు చెందిన తాన్య సోని ఉన్నారు. అలాగే యూపీకి చెందిన శ్రేయా యాదవ్, కేరళాకు చెందిన నివిన్ డాల్విన్ లు చనిపోయినట్లు ప్రకటించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.