26/11 తరహాలో పేలుళ్లకు కుట్ర..ఢిల్లీ మొత్తం పేలుళ్లకు టెర్రరిస్టుల ప్లాన్

26/11 తరహాలో పేలుళ్లకు కుట్ర..ఢిల్లీ మొత్తం పేలుళ్లకు టెర్రరిస్టుల ప్లాన్
  • 200 ఐఈడీ బాంబులతో బ్లాస్ట్​కు ప్లాన్
  • .ఎర్రకోట, ఇండియా గేట్, గౌరీశంకర్ టెంపుల్ టార్గెట్
  • దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్, రైల్వే స్టేషన్లూ లక్ష్యం
  • దీపావళి రోజు ఢిల్లీలో పేలుళ్లకు స్కెచ్.. సెక్యూరిటీ ఎక్కువగా ఉండటంతో వెనకడుగు
  • .2026, ఛబ్బీస్ జనవరిని ఫిక్స్ చేసుకున్న టెర్రరిస్టులు
  • దేశవ్యాప్తంగా మత కలహాలు రెచ్చగొట్టేందుకు కుట్ర
  • పాక్ నుంచి జైషే మహ్మద్ హ్యాండ్లర్ల సపోర్ట్
  • టర్కీ వెళ్లి హ్యాండ్లర్లతో ఇద్దరు డాక్టర్ల భేటీ
  • రెండేండ్లుగా బాంబుల తయారీ సామాగ్రి సేకరణ
  • దర్యాప్తు ఏజెన్సీల ఇన్వెస్టిగేషన్​లో కీలక విషయాల వెల్లడి

న్యూఢిల్లీ:26/11 ముంబై దాడుల తరహాలో ఢిల్లీ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల కోసం సుమారు 200కు పైగా అత్యంత శక్తివంతమైన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌‌ప్లోజివ్ డివైజ్‌‌లు (ఐఈడీలు) లేదా బాంబులను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలిపాయి. 

ఎర్రకోట, ఇండియా గేట్‌‌, కాన్‌‌స్టిట్యూషన్‌‌ క్లబ్‌‌, గౌరీశంకర్‌‌ ఆలయం, ఫరీదాబాద్, గుర్గావ్ సహా దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లు, షాపింగ్‌‌ మాల్స్‌‌ వద్ద పేలుళ్లకు పాల్పడాలని టెర్రరిస్టులు కుట్ర పన్నినట్లు వెల్లడించాయి. ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతున్నది. ఇందులో భాగంగానే పలువురు అనుమానితులు, నిందితులను దర్యాప్తు ఏజెన్సీలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి.

ఢిల్లీలో వరుస పేలుళ్లకు జనవరి నుంచే కుట్ర పన్నినట్లు తెలుస్తున్నది. రాజధానితో పాటు దేశవ్యాప్తంగా టార్గెట్ చేసుకున్న ప్రాంతాల్లోనూ టెర్రరిస్టులు రెక్కీ నిర్వహించారు. పేలుడుకు కారణమైన డాక్టర్ల టెర్రర్‌‌ మాడ్యూల్‌‌ వెనక పాక్‌‌ కేంద్రంగా పనిచేస్తోన్న జైషే మహ్మద్‌‌ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. 

కాగా, 2008, నవంబర్ 26న ముంబై దాడుల సమయంలో, తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, లియోపోల్డ్ హాస్పిటల్ సహా 12 స్పాట్ల వద్ద కాల్పులు, బాంబు దాడులు జరిగాయి. ఇదే తరహాలో ఢిల్లీలోనూ ప్లాన్ చేశారు.

ఎన్ క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానెల్స్ తో నిధుల సేకరణ

నిందితులంతా ఎన్‌‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానెల్‌‌లను ఉపయోగించారు. సామాజిక/ఆధ్యాత్మిక కార్యక్రమాల ముసుగులో ప్రొఫెషనల్, అకడమిక్ నెట్‌‌వర్క్‌‌ల ద్వారా నిధులను సేకరించారు. ఈ నిధులను లాజిస్టిక్స్, ఆయుధాల కొనుగోలు మరియు ఐఈడీల తయారీ కోసం ఉపయోగించారు. మరికొంత మందిని రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తున్నది. 

తమ వద్ద ఉన్న అత్యాధునికమైన ఎలక్ట్రానిక్ డివైజ్​ల ద్వారా ఎర్రకోట చుట్టూ ప్రధాన ల్యాండ్‌‌మార్క్‌‌లను, ట్రాఫిక్ ప్యాటర్న్‌‌లను, సెక్యూరిటీ అరేంజ్​మెంట్​లను పాయింట్ ఔట్ చేసుకున్నారు. 

అల్ ఫలా వర్సిటీ ప్రొఫెసర్ నిసార్ మిస్సింగ్

ఢిల్లీ ఎర్రకోట పేలుడు దర్యాప్తులో భాగంగా ఫరీదాబాద్‌‌లోని అల్ ఫలా యూనివర్సిటీపై దర్యాప్తు ఏజెన్సీలు ఫోకస్ చేశాయి. అయితే, యూనివర్సిటీలో పని చేస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ నిసార్ ఉల్‌‌ హసన్ కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు. గతంలో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లతో సంబంధాల ఆరోపణల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 2023, నవంబర్‌‌లో నిసార్ ఉల్ హసన్​ను ఉద్యోగం నుంచి తొలగించారు. 

నిసార్ ఉల్ హసన్ అప్పటికే శ్రీ మహారాజా హరి సింగ్ (ఎస్ఎంహెచ్ఎస్) హాస్పిటల్, శ్రీనగర్‌‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెడిసిన్)గా చేశారు. అయితే, రాష్ట్ర భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాల్లో ఆయన పాల్గొంటున్నారనే ఆరోపణలపై ఆర్టికల్ 311(2)(c) కింద విచారణ లేకుండానే అతన్ని తొలగించారు. డాక్టర్స్ అసోసియేషన్ కాశ్మీర్ అనే సంస్థకు నిసార్ అధ్యక్షుడిగా ఉన్నారు. 

ఆ తర్వాత, నిసార్​ను ఫరీదాబాద్‌‌లోని అల్ ఫలా యూనివర్సిటీ తన మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్‌‌గా నియమించుకున్నది.  ఢిల్లీ పేలుడు తర్వాత, డాక్టర్ నిసార్ కనిపించకుండా పోయాడు. దర్యాప్తు ఏజెన్సీలు అతని కోసం గాలిస్తున్నాయి.

జైషే హ్యాండ్లర్ల కోసం తుర్కియే వెళ్లిన ముజమ్మిల్, ఉమర్

ఢిల్లీ ఎర్రకోట బ్లాస్ట్​లో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ముగ్గురు డాక్టర్లలో ఇద్దరు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసం పాక్ ఆధారిత జైషే - మహమ్మద్ సంస్థకు చెందిన హ్యాండ్లర్‌‌లను కలిసేందుకు తుర్కియేకి వెళ్లినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. తుర్కియే నుంచి తిరిగి ఇండియాకొచ్చాకే ఈ బృందం ఇండియాలో తమ కార్యకలాపాలను ఎక్స్​పాన్డ్ చేసింది.

 ప్రధాన అనుమానితుల్లో ఒకడైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్, ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీయే టర్కీలో హ్యాండ్లర్‌‌లను కలిసినట్లుగా తెలుస్తున్నది. నిందితులంతా జైషే మొహ్మద్ ఆపరేట్ చేస్తున్న ‘ఫర్జాందర్ ఏ - దారుల్ ఉలూమ్’, ‘ఉమర్ బిన్ ఖత్తాబ్’ అనే 2 టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ఉగ్రవాదంవైపు అడుగులు వేసినట్లు దర్యాప్తులో తేలింది. 

ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో ముందుగా కాశ్మీర్ అంశాలపై చర్చ జరిగింది. ఆ తర్వాత అది కాస్త గ్లోబల్ జిహాద్, ప్రతీకారం తీర్చుకునే దిశగా వెళ్లింది. ఎర్రకోట బ్లాస్ట్ వెనుక ఐదుగురు లేదా ఆరుగురు డాక్టర్లు సహా 9 నుంచి 10 మంది సభ్యులు ఉన్నట్లు దర్యాప్తు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. డాక్టర్‌‌ ముజమ్మిల్, ఆదిల్‌‌, డాక్టర్‌‌ షాహిన్‌‌ కలిసి దాదాపు రెండేండ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్‌‌ వంటి పేలుడు పదార్థాలను తయారీ సామాగ్రిని సేకరిస్తున్నరు.

ఆలయాలు, మసీదులే లక్ష్యం

ఆలయాలు, చర్చిలు, మసీదుల్లోనూ టెర్రరిస్టులు పేలుళ్లకు ప్లాన్ చేశారు. దేశవ్యాప్తంగా మత కలహాలు సృష్టించేందుకు పన్నాగం పన్నినట్లు దర్యాప్తు ఏజెన్సీలు గుర్తించాయి. దీని కోసం ముందుగా ఢిల్లీతో పాటు గుర్గావ్, ఫరీదాబాద్ వంటి హై-ప్రొఫైల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ పేలుళ్ల కోసం జమ్మూ కాశ్మీర్‌‌లోని పుల్వామా, షోపియాన్, అనంతనాగ్‌‌లకు చెందిన కొందరు రాడికలైజ్డ్ డాక్టర్లను ఎంచుకున్నారు. 

వారు ‘వైట్ కాలర్’ కవర్‌‌గా ఉపయోగపడతారని భావించారు. నిందితులంతా డాక్టర్లు కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో వీళ్లు రెక్కీ నిర్వహించారు. సెక్యూరిటీతో పాటు ఎప్పుడు జనాలు ఎక్కువ ఉంటారనే విషయాలు తెలుసుకున్నారు. ధౌజ్, ఫతేపూర్ టాగా ప్రాంతాల్లో గదులను అద్దెకు తీసుకున్నారు. అక్కడే బాంబులు తయారు చేయాలని ప్లాన్ చేశారు.

మసీదులో 3 గంటలు.. 

ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ.. అంతకుముందు మసీదుకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ‘‘సోమవారం మధ్యాహ్నం 3:19 గంటలకు ఉమర్ కారును సునేరీ మసీదు పార్కింగ్‌‌ లాట్‌‌లో పార్క్ చేశాడు. ఆ తర్వాత రామ్‌‌లీలా మైదాన్‌‌కు దగ్గర్లోని మసీదుకు వెళ్లాడు. అక్కడ దాదాపు 3గంటల పాటు ఉన్నాడు. అనంతరం కారును తీసుకుని ఎర్రకోట వైపు వచ్చాడు” అని పోలీసాఫీసర్ ఒకరు తెలిపారు. 

‘‘ఆ 3 గంటలు ఉమర్ ఏం చేశాడు? ఫరీదాబాద్‌‌లో అరెస్టయిన తన సహచరుల గురించి తరచూ తెలుసుకున్నాడా? సిగ్నల్ ఫోన్ ద్వారా తన హ్యాండ్లర్‌‌‌‌తో టచ్‌‌లో ఉన్నాడా?” అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 

ఎర్ర కారులో తిరిగి ఉమర్ రెక్కీ.. 

ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ.. మరో కారును కూడా వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు. అతడు రెడ్‌‌ ఫోర్డ్‌‌ ఎకో స్పోర్ట్‌‌ కారు (DL10CK0458)లో తిరిగి రెక్కీ నిర్వహించినట్టు అనుమానిస్తున్నారు. ఆ కారు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయింది. అందులో అడ్రస్ న్యూసీలంపూర్‌‌‌‌ అని ఉంది. 

అక్కడికి పోలీసులు వెళ్లి విచారించగా.. ఆ అడ్రస్‌‌లో ఇమామ్ మహమ్మద్ తసవూర్ అనే వ్యక్తి ఉంటున్నాడు. అతడు మదర్సా నడిపిస్తున్నాడు. ఇమామ్ ఫోన్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లను వినియోగించి ఉమర్ ఈ కారును కొనుగోలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, అంతకుముందు రెడ్ కారు కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు.. అది హర్యానా ఫరీదాబాద్‌‌ ఖందవాలీ గ్రామంలోని ఫామ్‌‌హౌస్‌‌లో ఉన్నట్టు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.