V6 News

ఓపెన్ పేజి: ఓడింది కోటా కాదు..అదొక ఓట్ల డ్రామా!

ఓపెన్ పేజి: ఓడింది కోటా కాదు..అదొక ఓట్ల డ్రామా!

రాజ్యాంగ  సవరణకు అవసరమైన  మూడింట రెండొంతుల మద్దతు లేదని  మోదీకి, అమిత్ షాకు, వారి పార్టీకి ముందే తెలుసు. అందుకే  బిల్లు  వీగిపోగానే  విపక్షాలను నిందించడానికి వారు సిద్ధమై ఉన్నారు.  డీలిమిటేషన్,  మహిళా కోటా బిల్లు వీగిపోయిన పావుగంటలోపే పార్లమెంటు  మెట్ల ముందు ‘ప్రింటెడ్’  ప్లకార్డులతో  బీజేపీ  మహిళా నేతలు నిరసన వ్యక్తం చేశారు.  

బిల్లు వీగిన కొన్ని నిమిషాల్లోనే  ప్లకార్డులతో చేసిన నిరసనే వారి ఉద్దేశాన్ని దేశం ముందుంచింది.  బిల్లు నెగ్గదని తెలిసే కోటా అమలు ఖాయమనీ,  ఘనత  మోదీకేనని వారాల ముందే ప్రచారాలు, ర్యాలీలు, ప్రకటనలు, హంగామాకు కారణం దేశ మహిళా సమాజాన్ని భ్రమల్లో ఉంచడమేనా? బిల్లు వీగాక  క్షణాల్లోనే  సెషన్ వాయిదా వేశారు. అంతలోనే  రాజ్యసభలో డీఎంకే  పార్టీ  ఓ ప్రైవేటు బిల్లును పెట్టింది.

ఇప్పుడున్న సీట్లలోనే మూడోవంతు మహిళలకివ్వాలని  ప్రతిపాదించింది. దీన్ని అప్పుడే చర్చించి ఓటింగ్ పెట్టి ఉంటే  మోదీ చెబుతున్నట్లుగా  విపక్షాల మహిళా వ్యతిరేక వైఖరి దేశానికి తెలిసిపోయేది.  లేదంటే మహిళా కోటా ఇప్పటికిప్పుడు ఇవ్వాలనే ఉద్దేశం బీజేపీకి నిజంగా ఉందోలేదో కూడా బయటపడేది. మరునాడే హడావుడిగా కేంద్ర కేబినెట్ మీటింగ్ పెట్టారు.

సభలో ఊగిపోతూ మాట్లాడిన  కేంద్ర పెద్దలు  ఇంకేదో  పెద్ద నిర్ణయం చెప్తారని దేశమంతా ఆశించింది.  అదేం జరగలేదు. ఆ రాత్రి జాతినుద్దేశించి  ప్రధాని మోదీ  ప్రసంగిస్తారని ప్రకటన వచ్చినప్పుడూ  ఇంకేదో నిర్ణయం చెప్తారని మహిళలు ఎదురుచూశారు.  ఆ ప్రకటన రాకముందే ఆయన  కోయంబత్తూర్​లో  ఎన్నికల  ప్రచారం చేశారు. ఆ తర్వాత రాత్రి 8.30 గంటలకు చేసిన ప్రసంగంలోనూ ఆశించిన ప్రకటన ఏదీరాలేదు.  మహిళలకు క్షమాపణ  చెబుతూనే కారణాన్ని మాత్రం విపక్షాలపైకి నెట్టారు. మహిళలకు అవమానం జరిగిందని, వారు మరిచిపోకుండా శిక్షిస్తారని చెప్పారు. 

సభలో మహిళా కోటా బిల్లు ఓడిందా? 

నిజానికి 2023లో  మోదీ ఘనతగా  చెప్పుకుంటూ తెచ్చిన మహిళా కోటా బిల్లు ఇదే సభలో విపక్షాల మద్దతుతో  ఏకగ్రీవంగా నెగ్గింది. ఆ చట్టాన్ని మోదీ సర్కారే అమలు చేయలేదు.  మొన్న సమావేశాల మొదటిరోజు  అంటే  ఏప్రిల్ 16 నుంచి అది అమల్లోకి వచ్చినట్లు గెజిట్ ఇచ్చింది.  అంటే  అప్పటికే  కోటా చట్టం అమల్లో ఉంది.  కాబట్టి  ఇప్పుడు వీగిపోయింది కోటా బిల్లు  కాదన్నది  స్పష్టం.  డీలిమిటేషన్  తర్వాతే 2034లో  కోటా ఇస్తామని చట్టంలో  పెట్టింది మోదీ సర్కారే. 

కోటా కాకుంటే వీగిన బిల్లు ఏది?

కోటా  అమలుపేరుతో,  పాత జనాభా  లెక్కల ఆధారంగా  డీలిమిటేషన్  చేయడానికి  తెచ్చిన  రాజ్యాంగ సవరణ బిల్లు మాత్రమే వీగిపోయింది.  నిజానికి  మహిళా కోటాను,  ముందస్తు  డీలిమిటేషన్​ను  ఒకే బిల్లుగా  తెచ్చినందుకు అందరితోపాటు  బీజేపీ  మహిళా  నేతలు కూడా నిరసన  తెలపాల్సిందే. 

మహిళా కోటాకు, డీలిమిటేషన్​కు సంబంధం ఉందా?

కోటా ఇవ్వాలంటే  సీట్లు పెంచాల్సిందేనని  మోదీ  సర్కార్ చెబుతోంది. అందుకే  ఇప్పుడున్న సీట్లలో  కోటా  కుదరదని తానే  మహిళా కోటాను వ్యతిరేకిస్తోంది.  అయితే  చిత్తశుద్ధితో   కోటా  ఇవ్వాలనుకుంటే  2023 చట్టంలోనే  డీలిమిటేషన్  మెలిక తీసేసినా సరిపోతుంది.  మోదీ  తలచుకుంటే  బెంగాలీ  మసాలా బొరుగులు  తిన్నంత తేలికగా ఈ పని పూర్తిచేయచ్చు.

సీట్ల పునర్విభజనా? దేశ విభజనా?

ఇక డీలిమిటేషన్  వ్యవహారం. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచితే ఎవరికీ అన్యాయం జరగదనీ,  గొప్ప మేలని మోదీ, అమిత్ షా చెబుతున్నారు.  దీన్ని కూడా దక్షిణాది పార్టీలు, ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని అంటున్నారు.  ఈ వాదనకు ఏపీ అధికార,  ప్రతిపక్షాలు, మేధావులుగా  చెప్పుకునే కొందరు కూడా మద్దతిస్తున్నారు.

 ఈ  ఫార్ములా అంత సులువైంది అయితే  2002లో  ప్రధానమంత్రి  వాజ్​పేయి ఎందుకు ఎంచుకోలేదన్నది  వారే  చెప్పాలి.  ఇందిరాగాంధీ  ఏ ఉద్దేశంతో  సీట్ల పెంపుపై  పరిమితి పెట్టారు?  వాజ్​పేయి  ఏ  జాతీయ  ప్రయోజనం  కోసం  సీట్లపెంపును  వాయిదా వేశారు?  ముందుగా ఆలోచన చేయాలి.  

తాత్కాలిక రాజకీయ  ప్రయోజనం కోసం,  ఓట్ల కక్కుర్తికి  తొందరపాటు  నిర్ణయాలకు  మద్దతిస్తే  రాబోయే  ప్రమాదాలను  దేశమే  ఎదుర్కోవాల్సి వస్తుంది.   సమానంగా  సీట్ల పెంపు,  సీట్ల రేషియో మారకపోవడం  వినడానికి బాగానే ఉంది. కానీ  ఉత్తరాది,  దక్షిణాది,  ఇతర  ప్రాంతాల సీట్ల సంఖ్యలో ఇప్పుడున్న సీట్లతో  పోలిస్తే  భేదం చాలా పెరిగిపోతుందన్నది స్పష్టంగా కనిపిస్తుంది.  దీంతో  కొన్ని  ఉత్తరాది  రాష్ట్రాల సీట్లు గెలిచి కేంద్రంలో  అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు.  దీంతో  ఇతర  రాష్ట్రాలకు  కేంద్ర పాలనలో భాగం తగ్గిపోయి,  వాటి ప్రయోజనాలు  దెబ్బతినే ప్రమాదం ఉంది. 

దక్షిణాది రాష్ట్రాల ప్రధాన ఆందోళన ఇదే. ..

కోటా రావాలి.. న్యాయంగా సీట్లు కావాలి..సీట్ల పెంపు ఆగిందని  గగ్గోలు పెట్టే  మేధావులు  వారు చెప్పే  ప్రజాస్వామిక  సూత్రాలను  వారే  గుర్తుచేసుకోవాల్సిన  దుస్థితిలో  పడ్డారు. రాజ్యాంగ  సవరణకు  మూడింట  రెండొంతుల మెజారిటీ  లేదంటేనే దేశం హడావుడి డీలిమిటేషన్​ను  వ్యతిరేకిస్తోందని అర్థం. ఈ అంశంపై  అభ్యంతరాలు,  సమస్యలను వినడానికి  కేంద్రం  ముందే  ప్రయత్నించాల్సింది.  సూచనలు తీసుకొని  తగిన  పరిష్కారం  చూపించాల్సింది. అభివృద్ధిలో  కీలకంగా ఉన్న రాష్ట్రాలకు అన్యాయం  జరగట్లేదని  భరోసా ఇవ్వాల్సింది.   

మోదీ,  అమిత్ షా   నోటిమాటల భరోసా  ఎట్లాంటిదో  దేశానికి తెలిసిందే.   అవినీతి  నియంత్రణ,  పెట్రోలు రేట్లు,  పన్నుల భారం,  డాలర్  విలువ,  ఢిల్లీ రాష్ట్ర హోదా,  ఏపీ  ప్రత్యేకహోదా,  జమ్మూ కాశ్మీర్  రాష్ట్ర హోదా, లఢఖ్  సమస్య లాంటివి  చెప్పుకుంటే లెక్కలేదు.  దేశ భవిష్యత్ ను  మార్చే  అంశాల్లో  కచ్చితంగా  పాటించాల్సిన  ఏ  ప్రజాస్వామిక  పద్ధతినీ  మోదీ  సర్కార్  గౌరవించలేదు.

హడావుడిగా  ఎన్నికల కోసం  డీలిమిటేషన్  ప్రతిపాదన తెచ్చి కోటా పేరుపెట్టింది.  దీనికి  ఒప్పుకోకుంటే  మహిళలకు  వ్యతిరేకమన్నట్లుగా  బ్లాక్ మెయిలింగ్  వ్యూహాన్ని అమలుచేసింది.  రాష్ట్రాల  ఆందోళనలను పట్టించుకోని  డీలిమిటేషన్  బిల్లు  ఓటమే  పుష్కరకాలంలో  దేశంలో  ప్రజాస్వామ్యానికి దక్కిన అతిపెద్ద విజయం. 

ఓట్ల  కుతంత్రమే  ఘోరంగా  ఓడింది

ఈ సందర్భంలో లోక్​సభలో డీఎంకే ఎంపీ రాజా మాటను గుర్తుచేసుకోవాలి.  ‘దేశభక్తి విషయంలో మీరు మాకు పాఠాలు చెప్పలేరు.  పాకిస్థాన్​తో  బంగ్లా వార్  నుంచి  కార్గిల్ వార్  వరకు దేశానికి అండగా నిలవడంలో  ముందున్నది తమిళనాడే.   కానీ,  రాష్ట్ర  ప్రయోజనాల విషయంలో అన్యాయం జరిగితే కచ్చితంగా అటానమస్ కోరతాం’ అని  రాజా  తేల్చి చెప్పారు.   

ఓట్ల కోసం  దేశ భవిష్యత్​తో  ఆటలాడే  రాజకీయానికి ఇదొక హెచ్చరిక. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన  తెలంగాణను  దేశ విభజనతో పోల్చే స్థాయికి దిగజారిన నాయకులు రాష్ట్రాల హక్కులకు నష్టం జరిగితే తలెత్తే  పరిణామాలకు,  సంక్షోభాలకు బాధ్యత  తీసుకుంటారా?  చెప్పాలి.  చివరిగా 2023లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన  మహిళా కోటా భద్రంగానే ఉంది.

కానీ  ఓట్ల కోసం  కుతంత్రం  నింపుకున్న రాజకీయమే లోక్​సభలో  ఘోరంగా  ఓడిపోయింది. మహిళా  కోటాలాంటి  సున్నితమైన  అంశంపై  ఓట్ల కోసం ప్రయోగం  చేసిన తీరును  దేశ మహిళలంతా చూశారు.  వారికి  ఆశపెట్టి  అవమానించిందెవరో,  ఎవరిని  శిక్షించాలో  వారే  నిర్ణయించుకుంటారు.

మహిళలకు అవమానం

దక్షిణాది  పన్నుల మీద  కేంద్రానికి ఉన్న శ్రద్ధలో  కొంత ఈ  రాష్ట్రాల అభివృద్ధి, ఆందోళన మీద పెట్టి ఉంటే ఇంత సమస్య రాకపోవచ్చు.  ఇప్పుడు మోదీ సర్కార్​కు  ఊతకర్రగా ఉన్న  ఏపీకి అనివార్యంగా  కేంద్రం భారీసాయం చేస్తోంది.  

మిగతా  రాష్ట్రాలపై  వివక్ష  చూపిస్తోందన్న  ఆందోళన ఉంది.  అప్పట్లో  దక్షిణాది గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్  గొంతెత్తినప్పుడు  కేంద్రంలో ఉన్నది మోదీ పాలనే.  నిజానికి ఉత్తరాది, దక్షిణాది అంతరాలను పెంచి పోషించింది కేంద్ర సర్కారే.  ఇప్పుడున్న  సీట్లలో  మహిళా  కోటా  ఇచ్చినా  అభ్యంతరం  లేదని  టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు  లోక్ సభలో  పార్టీ  వైఖరిగా చెప్పారు.  

విపక్షాలు కూడా అదే చెబుతున్నాయి.  మరి టీడీపీ మద్దతిస్తున్న ఈ ప్రతిపాదనకు మోదీ సర్కారు ఎందుకు  ఒప్పుకోవడం లేదన్నదే వారి చిత్తశుద్ధిని చెబుతోంది. పైగా కోటా అమలు  కంటే  విపక్షాలు అడ్డుకున్నాయన్న ఎలక్షన్  ప్రచారానికే  మోదీ  ఎక్కువ  ఆసక్తి  చూపించారు.  ఒకరకంగా  కోటా  ఇస్తామని  ఆశపెట్టి  మహిళలను  బీజేపీ అవమానించినట్లైంది.


- మురళి, జర్నలిస్ట్–

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.