అమెరికాపై డెల్టా కరోనా పంజా

అమెరికాపై డెల్టా కరోనా పంజా
  • నెమ్మదించిన వ్యాక్సినేషన్​.. పెరుగుతున్న కేసులు
  • వారంలో రోజువారీ సగటు కేసులు 13,859
  • అంతకుముందుతో పోలిస్తే 21% పెరుగుదల

వాషింగ్టన్​: అమెరికాపై డెల్టా కరోనా పంజా విసురుతోంది. వ్యాక్సినేషన్​ నెమ్మదించడంతో కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వారంలో సగటున రోజూ 13,859 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రెండు వారాలతో పోలిస్తే కేసులు 21 శాతం పెరిగాయి. జులై 3 వరకు మునుపటి రెండు వారాల్లో వచ్చిన కరోనా కేసుల్లో డెల్టా కేసులే 52 శాతం ఉన్నాయని అమెరికా సెంటర్స్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​ (సీడీసీ) ప్రకటించింది. అమెరికానే ఎక్కువ మందికి టీకాలు వేసినా.. ఏప్రిల్​ నుంచి స్లో అయింది. దేశ ఇండిపెండెన్స్ డే నాటికి కనీసం 70 శాతం మంది పెద్దలకు టీకాలివ్వాలన్న ప్రెసిడెంట్​ జో బైడెన్​ టార్గెట్​ కొద్దిలో మిస్సయింది. 67 శాతం మందికి టీకాలు అందాయి. ఇటు బ్రిటన్​లోనూ డెల్టా ముప్పు ఎక్కువవుతోంది. గురువారం కొత్తగా 32,548 మంది మహమ్మారి బారిన పడ్డారు. జనవరి నుంచి ఒక్కరోజులో ఎక్కువ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. అంతకుముందు వరకు 5 వేల కన్నా తక్కువే కేసులు రాగా.. డెల్టా వేరియంట్​ ప్రభావంతో కేసులు పెరుగుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. వేసవి వచ్చేనాటికి రోజువారీ కేసులు లక్ష దాటుతాయని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్​ జావిద్​ ఆందోళన వ్యక్తం చేశారు. 

40 లక్షల మంది బలి
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 40.20 లక్షల మంది చనిపోయారు. 1982 నుంచి జరిగిన యుద్ధాల్లో మరణించిన వారి సంఖ్యకు అది దాదాపు సమానం. న్యూయార్క్​ సిటీ జనాభాలో సగం. అయితే, వ్యాక్సిన్లు వాడకంలోకి రావడం, చాలా దేశాల్లో వేగంగా కార్యక్రమం జరుగుతుండటంతో రోజువారీ డెత్స్​తగ్గుతున్నాయి. జనవరిలో రోజూ 18 వేల మంది చనిపోతే.. ఆ సంఖ్య 8 వేలకు తగ్గింది.