సెకండ్ హ్యాండ్ బండ్లు మస్తు కొంటున్నరు

సెకండ్ హ్యాండ్ బండ్లు మస్తు కొంటున్నరు

హైదరాబాద్‌‌, వెలుగు: సెకండ్ హ్యాండ్ వెహికల్స్​కు డిమాండ్ పెరిగింది. యూజ్డ్ కార్లు అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. కరోనా భయంతో చాలా మంది సొంత వెహికల్​లో జర్నీకి మొగ్గు చూపుతున్నారు. అన్​లాక్​లతో బిజినెస్‌‌, సేల్స్‌‌ ఊపందుకొని వాటి ధరలు పెరిగాయి. బ్యాంకులు కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్స్​కు లోన్‌‌ సౌలత్​ కల్పిస్తున్నాయి. అయితే ఈ తరహా వెహికల్స్​ కొనుగోళ్లు ఆన్‌‌లైన్‌‌ వెబ్‌‌సైట్ల ద్వారా ఎక్కువగా జరుగుతున్నాయి. ఆర్టీఏకు కూడా భారీగా ఆదాయం వస్తోంది.

ఓన్‌‌ వెహికల్స్‌‌కే ప్రాధాన్యం

కరోనా ఎఫెక్ట్, ఫిజికల్ డిస్టెన్స్ నేపథ్యంలో పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్​కు జనాలు ఇంట్రెస్ట్‌‌ చూపించడంలేదు. ఆర్టీసీ బస్సులు సగం కూడా నిండటంలేదు. రైళ్లు అంతంత మాత్రమే నడుస్తున్నాయి. ఎంఎంటీఎస్‌‌ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అనేక మంది సొంతంగా వెహికల్స్​లో వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సెకండ్‌‌ హ్యాండ్‌‌లో వాహనాలు కొంటున్నారు. యూజ్డ్‌‌ వెహికల్స్‌‌కు డిమాండ్‌‌ పెరగడంతో మరోవైపు ధరలు కూడా పెరిగాయి.

కరోనా టైమ్​ల పెరిగిన సేల్స్

కరోనాతో పరిస్థితుల్లో కూడా కిందటేడాదితో పోలిస్తే ఈ సారి సెకండ్‌‌ హ్యాండ్‌‌ బండ్ల సేల్‌‌ పెరిగాయి. గతేడాది జూన్‌‌ నుంచి సెప్టెంబర్‌‌ వరకు 73,571 బైకులు సెకండ్ రిజిస్ట్రేషన్‌‌ కాగా, ఈ ఏడాది అదే టైమ్​లో 85,395 రిజిస్టర్‌‌ అయ్యాయి. అంటే ఈ ఏడాది 11,824 సెకండ్‌‌ హ్యాండ్‌‌ బండ్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. అలాగే గతేడాది 44,902 సెకండ్‌‌ హ్యాండ్‌‌ కార్లు రిజిస్టర్‌‌ కాగా, ఈ సారి ఏకంగా 53,307 కార్లు అమ్ముడయ్యాయి. అంటే 8,405 కార్లు ఎక్కువగా కొన్నారు. ఇవన్నీ రెండోసారి రిజస్టర్‌‌ అయిన వాహనాలు మాత్రమే. ఇంకా మూడు, నాలుగో సారి రిజిస్టర్‌‌ అయిన వాహనాలను కూడా లెక్కలోకి తీసుకుంటే సంఖ్య మరింత పెరుగుతుంది.

ఆన్‌‌లైన్‌‌లోనే ఎక్కువగా కొంటున్రు

గతంలో ఎక్కువగా తెలిసిన డీలర్లు, ఏజెంట్లు, వ్యక్తుల వద్ద సెకండ్‌‌ హ్యాండ్‌‌ బండ్లను కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఎక్కువ మంది ఆన్‌‌లైన్‌‌లో చూసి కొంటున్నారు. ఇటీవల కాలంలో ఓఎల్‌‌ఎక్స్‌‌, క్విక్కర్‌‌, డ్రూమ్‌‌, కార్‌‌దేఖో, కార్‌‌వాలే, కార్‌‌24 తదితర వెబ్‌‌సైట్లలో చూసి ఎక్కువగా కొంటున్నారు. ఆన్‌‌లైన్‌‌లో వాహనం ఫీచర్స్‌‌, రివ్యూతోపాటు పూర్తి వివరాలు అందుబాటులో ఉంటున్నాయి.

సర్కార్​కు మస్త్ ఇన్​కం

సెకండ్‌‌ హ్యాండ్‌‌ బండ్లతో ఆర్టీఏకు మస్తు ఇన్‌‌కం వస్తోంది. ఏడాదిలో లక్షల సంఖ్యలో వాహనాలు రెండోసారి, మూడోసారి రిజిస్టర్‌‌ అవుతున్నాయి. మోటార్‌‌ బైక్‌‌ ట్రాన్స్‌‌ఫర్‌‌కు సుమారుగా రూ.685 తీసుకుంటున్నారు. కార్లకు మాత్రం రూ. 1085 వరకు తీసుకుంటున్నారు. ఈ లెక్కన చూసినా ఈ ఏడాది ఆర్టీఏకు కోట్లలో ఆదాయం
చేకూరుతోంది.

కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు మస్ట్‌‌

యూజ్డ్‌‌ వెహికల్‌‌ కొనేందుకు తప్పనిసరిగా కొన్ని జాగ్రతలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాహనానికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయో లేదో చూసుకోవాలి. వాటిలో ఉన్న వివరాల ప్రకారం ఇంజన్, చాసిస్ నంబర్ క్రాస్‌‌ చెక్‌‌ చేయాలి. తెలిసిన మెకానిక్‌‌ను తీసుకెళ్లి బండి కండిషన్‌‌ చెక్ చేయాలి. ఇంజన్ కెపాసిటీ, పనితీరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. బండిపై కేసులు ఉన్నాయేమో తెలుసుకోవాలి. వాహనం ఫైనాన్స్‌‌లో తీసుకుంటే ఆ కంపెనీ నుంచి నో అబ్జెక్షన్‌‌ సర్టిఫికెట్ తీసుకోవాలి. కొన్న వెంటనే తమ పేరు మీద రిజిస్టర్ చేసుకోవాలి