జనరల్​ సీట్లలోనూ.. టికెట్లు కావాలి

జనరల్​ సీట్లలోనూ.. టికెట్లు  కావాలి
  • జనరల్​ సీట్లలోనూ.. టికెట్లు  కావాలి
  • ఆదివాసీ కాంగ్రెస్​  మహాసభలో  నేతల డిమాండ్​
  • ఎస్టీలకు బీఆర్​ఎస్​ చేసిందేమీ లేదు
  • ఆదివాసీల వల్లే వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్​ గెలిచింది:  ఆదివాసీ కాంగ్రెస్​ నేషనల్​ చైర్మన్ మోగే 
  • 79 అసెంబ్లీ సీట్లలో గెలుపును నిర్ణయించేది ఆదివాసీ ఓట్లే: బెల్లయ్య నాయక్​
  • ఎస్టీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 
  • అన్యాయం చేస్తున్నయ్: మాణిక్​రావ్​ ఠాక్రే

హైదరాబాద్​, వెలుగు:  ఈసారి అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో ఆదివాసీలు, గిరిజనులకు జనరల్​ స్థానాల్లోనూ టికెట్లను కేటాయించాలని కాంగ్రెస్​ ఎస్టీ నాయకులు డిమాండ్​ చేశారు. రిజర్వేషన్​ కేటగిరీతో పాటు జనరల్​లోనూ పార్టీ హైకమాండ్​ సముచిత ప్రాధాన్యం కల్పించాలన్నారు. ఆదివారం గాంధీభవన్​లోని ప్రకాశం హాల్​లో ఆదివాసీ కాంగ్రెస్​ రాష్ట్ర చైర్మన్​ బెల్లయ్య నాయక్​ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్​ నేషనల్​ చైర్మన్​ శివాజీ రావ్​ మోగే మాట్లాడుతూ.. చత్తీస్​గఢ్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​లో ఆదివాసీల వల్లే కాంగ్రెస్​ గెలిచిందన్నారు. రాష్ట్రంలో ఆదివాసీల కోసం బీఆర్​ఎస్​ చేసిందేమీ లేదని విమర్శించారు. ఆదివాసీల అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యమని, వారిపై గాంధీ కుటుంబానికి ప్రేమ అని చెప్పారు. వారికి భూమి హక్కులు కల్పించింది కాంగ్రెస్​ పార్టీనేనని తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్​సభ ఎన్నికల్లో ఆదివాసీలకు రిజర్వేషన్ ​కోటాతో పాటు జనరల్​ స్థానాల్లోనూ టికెట్లు కేటాయించాలని ఆయన డిమాండ్​ చేశారు.  

జనరల్​ సీట్లలోనూ టికెట్లు కావాలి

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​ రావు ఠాక్రే మాట్లాడుతూ.. ఆదివాసీలు, గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్​ ఒక్కటే అనేందుకు లిక్కర్​ స్కామ్​ కేసు నుంచి కేసీఆర్​ కూతురు కవితను తప్పించడమే నిదర్శనం” అని ఆరోపించారు. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్​ పార్టీ కట్టుబడి ఉందన్నారు. భారత్​ జోడో యాత్ర సందర్భంగా ఆదివాసీ సమస్యలపై రాహుల్​ గాంధీ పూర్తి స్థాయిలో స్టడీ చేశారని చెప్పారు. ఆదివాసీ, గిరిజన కమిటీలను ఏర్పాటు చేసి వారికి కాంగ్రెస్​ అందుబాటులో ఉంటున్నదని తెలిపారు. ‘‘దేశంలో ఆర్​ఎస్​ఎస్​ రాజనీతి కొనసాగుతున్నది. రిజర్వేషన్లను ఎత్తేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నయ్​ హిందూ, ముస్లిం, ఆదివాసీ, గిరిజన తెగల మధ్య చిచ్చు పెడుతున్నరు” అని ఆయన దుయ్యబట్టారు. కర్నాటకలో ఆదివాసీలు కాంగ్రెస్​కు మద్దతిచ్చారని, అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ అండగా ఉండాలని ఏఐసీసీ జనరల్​ సెక్రటరీ రోహిత్​ చౌదరి కోరారు.  

కేసీఆర్​ మాయ మాటలుచెప్తున్నడు: బెల్లయ్య నాయక్​

రాష్ట్రంలోని 79 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను నిర్ణయించేది ఆదివాసీ, గిరిజనుల ఓట్లేనని ఆదివాసీ కాంగ్రెస్​ రాష్ట్ర చైర్మన్​ బెల్లయ్య నాయక్​ అన్నారు.  దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆదివాసీ అభ్యర్థులు జనరల్​ స్థానాల్లో పోటీ చేసి గెలిచారని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలోనూ వారికి జనరల్​ స్థానాల్లోనూ టికెట్లు ఇవ్వాలని ఆయన కోరారు. మాయమాటలతో గిరిజనులను కేసీఆర్​ మోసం చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. సంక్షేమ పథకాల అమలులో మొండి చెయ్యి చూపిస్తున్నారని అన్నారు. డబుల్​ బెడ్రూం ఇండ్ల మంజూరులో అన్యాయం చేశారని తెలిపారు. కాంగ్రెస్​ పార్టీలో గ్రూపులున్నాయంటూ కేసీఆర్​ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్​కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. 

ఎస్సీ, ఎస్టీలనుకేసీఆర్​ విడదీస్తుండు: బలరాం నాయక్​

గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​ను కాంగ్రెస్​ పార్టీ తన హయాంలో అమలు చేసిందని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్​ అన్నారు. అయితే, రాష్ట్రంలో కేసీఆర్​ సర్కార్​ మాత్రం ఎస్సీ, ఎస్టీలను విభజించే ప్రయత్నం చేస్తున్నదని.. దళిత, గిరిజన, ఆదివాసీలకు తప్పుడు హామీలిచ్చి టైంపాస్​ చేస్తున్నదని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన ఆదివాసీలు, గిరిజనులకు సీట్ల కేటాయింపులు ఉండాలన్నారు.  

హక్కుల కోసం పోరాడాలి: రాములు నాయక్​

ఆదివాసీలంతా ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారి పాత్ర కూడా కీలకమైందని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో టికెట్ల పోటీ తీవ్రంగా ఉందని, సీట్ల కేటాయింపులో కాంగ్రెస్​ అధిష్ఠానం ఆదివాసీలకు సముచిత స్థానం కల్పించాలని ఆయన కోరారు. ఎన్నికల్లో ఆదివాసీలకు జనరల్​స్థానాల్లో పోటీ చేసేలా అవకాశం ఇవ్వాలని, జనరల్​లో 12 సీట్లిస్తే గెలిపించి చూపిస్తామని చెప్పారు.