
హుజూరాబాద్ వెలుగు : పీవీ జిల్లా ఏర్పాటు కోసం పీవీ జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో శనివారం సకలజనుల ర్యాలీ భారీ ఎత్తున జరిగింది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జిల్లా సాధన కోసం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ జిల్లా సాధన కమిటీ జేఏసీ నాయకుడు వర్దినేని రవీందర్ రావు మాట్లాడుతూ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ పీవీ జిల్లా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. పీవీ జిల్లా ఏర్పాటు చేస్తే స్థానికులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, ఉద్యోగ వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
హనుమకొండలో జరిగే సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ జిల్లా ఏర్పాటుపై ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు పీవీ జిల్లాను కోరుకుంటున్నారని తెలిపారు. జిల్లా ఏర్పాటు విషయంలో ఇంకా జాప్యం చేస్తే ఉద్యమం మరింత తీవ్రం చేస్తామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పీవీ జిల్లా సాధన కమిటీ నాయకులు ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.