డబుల్ బెడ్​ రూమ్​ ఇండ్లలో పనుల పేరుతో వసూళ్లు .. కనెక్షన్ల కోసం డబ్బులు చెల్లించాలని డిమాండ్

డబుల్ బెడ్​ రూమ్​ ఇండ్లలో పనుల పేరుతో వసూళ్లు  .. కనెక్షన్ల కోసం డబ్బులు చెల్లించాలని డిమాండ్
  • కొన్ని చోట్ల ఇంకా పూర్తికాని ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్
  • ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ వారిమంటూ లబ్ధిదారులకు కాల్స్‌‌‌‌
  • డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు :  డబుల్ బెడ్రూం ఇండ్లలో పెండింగ్​లో ఉన్న పనులు చేసేందుకు లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు. ఎన్నికల ముందు పట్టాలు పొందిన వారు ఇండ్ల లోకి వెళ్దామంటే ఎదో ఒక అడ్డంకి వస్తున్నది. కొన్ని పనులు పెండింగ్‌‌‌‌లో ఉండటంతో లబ్ధిదారులు ఆ ఇండ్లలోకి వెళ్లలేకపోతున్నారు. ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్ తదితర పనులు ఇంకా పెండింగ్​లో ఉండడంతో ఎప్పుడు పూర్తి అవుతాయోనని పట్టాలు పొందిన వారు ఎదురుచూస్తున్నారు. 

ఇదే అనువుగా భావిస్తున్న కొందరు సిబ్బంది ఆ పనులు, ఈ పనులు అంటూ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసే కార్యక్రమానికి తెరలేపారు. ప్రతాప సింగారంలో లబ్ధిదారులకు ఇండ్లను అందజేశారు. అయితే ఇక్కడ విద్యుత్ పనులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ నుంచి కాల్ చేస్తున్నామని, కనెక్షన్ ఇవ్వడానికి డబ్బులు ఇవ్వాలని లబ్ధిదారులను డిమాండ్ చేస్తున్నారు. గూగుల్‌‌‌‌ పే, ఫోన్ పే చేయాలని కోరుతున్నారు.

ఇంకో రెండు, మూడు నెలలు..

గ్రేటర్​లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు అందుకున్నప్పటికీ లిఫ్టులు, వాటర్, ఎలక్ట్రిసిటీ తదితర పనులు పూర్తికాకపోవడంతో లబ్ధిదారులు ఇండ్లలోకి వెళ్లలేకపోతున్నారు. చాలా చోట్ల ఏడాదిన్నర క్రితమే వీటి నిర్మాణాలు పూర్తయినప్పటికీ ఎన్నికలు దగ్గర పడ్డప్పుడు అందజేశారు. అయితే నిర్మాణాలు పూర్తయి ఎక్కువ రోజులు అలాగే ఉంచడంతో కొన్ని రిపేర్లు కూడా చేయాల్సి ఉంది. వీటితో పాటు కొన్ని పనులు పెండింగ్‌‌‌‌లో ఉండటంతో పట్టాలు అందుకున్న వారిని ఇండ్లలోకి అనుమతివ్వడం లేదు. పట్టాలు ఇచ్చే ముందే అన్ని పనులు పూర్తిచేసి ఇండ్లు అప్పగించి ఉంటే బాగుండేదని లబ్ధిదారులు అంటున్నారు.

కొత్త సర్కార్ పైనే ఆశలు....

డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు కొత్త ప్రభుత్వంపైన ఆశలు పెట్టుకున్నారు. ఇది వరకు ఉన్న బీఆర్ఎస్​ ప్రభుత్వం పట్టాలు ఇచ్చినప్పటికీ ఇండ్లలోకి మాత్రం వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కిరాయి ఇండ్ల రెంట్లు చెలించాల్సి వస్తుందని తెలిపారు. ఎన్నికల ముందు హడావుడిగా 70 వేల ఇండ్లను అందించినప్పటికీ పెండింగ్ వర్క్స్, రిపేర్ల కారణంగా వెయ్యి మంది కూడా ఇండ్లలోకి పోలేకపోయారు.

డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి

డబుల్ బెడ్రూం ఇండ్ల పనుల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే  తమ దృష్టికి తీసుకురావాలి. పనులు చేసేందుకు ఎవరు కూడా డబ్బులు అడగొద్దు. అన్ని పనులు ప్రభుత్వమే ఫ్రీగా చేస్తుంది. కరెంట్ మీటర్ తీసుకోవాలంటే సంబంధిత విద్యుత్ ఏఈ ఆఫీసులో సంప్రదిస్తే అక్కడ అన్ని వివరాలు తెలియజేస్తారు.

సురేశ్, హౌసింగ్ సీఈ, జీహెచ్ఎంసీ