మంత్రులు పర్యటనకు వస్తే .. జనాలు పోలీస్ స్టేషన్లలో ఉండాలా? : ములుగు ఎమ్మెల్యే సీతక్క

మంత్రులు పర్యటనకు వస్తే  .. జనాలు పోలీస్ స్టేషన్లలో ఉండాలా? : ములుగు ఎమ్మెల్యే సీతక్క

ములుగు, వెలుగు :  ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నిస్తే..సమస్యలపై, ఇండ్ల కోసం అడిగితే అరెస్ట్​ చేస్తరా?   మంత్రులు వస్తే  ప్రజలు పోలీస్​స్టేషన్లలో ఉండాలా?’ అంటూ మహిళా కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క సర్కారుపై ఫైర్​అయ్యారు. గురువారం ములుగులో మెడికల్ కాలేజీ శంకుస్థాపనకు మంత్రులు హరీశ్​రావు, దయాకర్ రావు, సత్యవతి రాథోడ్​ రాగా పోలీసులు ఆశా కార్యకర్తలు, అంగన్​వాడీ ఉద్యోగులు, కొండాయి నుంచి ఇండ్ల కోసం వచ్చిన మహిళలను అదుపులోకి తీసుకొని పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా కొందరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. 

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సీతక్క వారిని పోలీస్​స్టేషన్​లో పరామర్శించారు. తర్వాత వారితో కలిసి పోలీస్ స్టేషన్​ నుంచి ఏరియా దవాఖాన వరకు వెళ్లి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. డీఎస్పీ రవీందర్​ అక్కడికి వచ్చి ఆందోళన విరమించాలని కోరడంతో సీతక్క కాంగ్రెస్​, సీపీఐ నాయకులు, అంగన్​వాడీ, ఆశా వర్కర్లు, కొండాయి గ్రామ మహిళలతో కలిసి కలెక్టరేట్​కు ర్యాలీగా వెళ్లారు. కలెక్టరేట్ ​ముందు ఆందోళన నిర్వహించిన తర్వాత ఇన్​చార్జి అడిషనల్​కలెక్టర్​ డీఎస్​.వెంకన్నకు వినతిపత్రం అందజేశారు. అప్పటికే మంత్రుల ప్రోగ్రాం ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మంత్రులు ములుగుకు వస్తే ప్రజలను అరెస్ట్​ చేసి  పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారని, ఇదేం పద్ధతని ప్రశ్నించారు. కార్మికులంతా మంత్రి హరీశ్​రావును కలిసేందుకు వస్తే కలవనివ్వకుండా భయపెట్టడం ఏమిటన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్​ తమ అంగన్​వాడీలు బాగా పనిచేస్తున్నారని పొగుడుతూనే అణిచివేస్తున్నారని ఈ ధోరణి సరికాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని అధికార పార్టీ కార్యక్రమంగా నిర్వహించమేమిటన్నారు. జిల్లా అధికారులు గులాబీ జెండాను తమ ఎజెండాగా వ్యవహరించారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదని, పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్​, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీపీసీసీ సభ్యుడు మల్లాడి రాంరెడ్డి, కిసాన్​సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్​గౌడ్, యూత్ కాంగ్రెస్​జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్, మండల అధ్యక్షుడు ఎండీ.చాంద్​పాషా, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జంపాల రవీందర్ పాల్గొన్నారు.