
- అధికారులకు మంత్రి వెంకట్రెడ్డి ఆదేశం
నల్గొండ, వెలుగు: నల్గొండలో అక్రమంగా కట్టిన బీఆర్ఎస్ ఆఫీసును ఆగస్టు 11లోగా కూల్చేయాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. శనివారం మున్సిపల్ కౌన్సిల్ హాల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఆయన మాట్లాడుతూ.. కౌన్సిల్ తీర్మానం లేకున్నా ప్రభుత్వ స్థలంలో నిర్మించినందున బీఆర్ఎస్ భవనాన్ని వెంటనే కూల్చేయాలని ఆదేశించారు. తాను అమెరికా పర్యటనకు వెళ్తున్నానని, ఆగస్టు 11న తిరిగొస్తానని, అప్పటిలోగా బీఆర్ఎస్ ఆఫీస్ తనకు కనిపించొద్దని అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్కు నోటీసులు ఇచ్చి కూల్చివేత పనులు మొదలుపెట్టాలన్నారు. ఆ ప్లేస్ లో స్త్రీ నిధి భవనంతోపాటు పలు ప్రభుత్వ శాఖల ఆఫీసులను నిర్మిస్తామని వెల్లడించారు. నల్గొండ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.