సాలార్​​జంగ్​ కంచెలో.. ఇండ్ల కూల్చివేతలు

సాలార్​​జంగ్​ కంచెలో.. ఇండ్ల కూల్చివేతలు
  • అడ్డుకున్న స్థానికులు.. తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట ధర్నా
  • హౌస్ నంబర్లు ఉండగా ఎలా కూల్చివేస్తారని నిలదీత

మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయిప్రియా కాలనీ సాలార్​జంగ్​కంచెలో రెవెన్యూ అధికారులు మంగళవారం పలు నిర్మాణాలను కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్త్ నడుమ కొనసాగించారు. అయితే ఇంటి నంబర్లు ఉన్న ఇండ్లను ఎలా కూల్చివేస్తారని బాధితులు ఆందోళనకు దిగారు. కూల్చివేతలను అడ్డుకుని తహసీల్దార్ ఆఫీస్​ముందు ధర్నా చేశారు. బాధితులు తెలిపిన ప్రకారం.. 40 ఏండ్ల కింద చాలా మంది తెలియక సర్వే నంబర్లు 1, 10, 11లోని సీలింగ్​ల్యాండ్​లో ప్లాట్లు కొన్నారన్నారు.  అప్పటి నుంచి ఇంటి నంబర్లు కేటాయించాలని పోరాడుతున్నామన్నారు.  

రెవెన్యూ అధికారులు 2011–2014 వరకు రిజిస్ట్రేషన్లు చేసినప్పటికీ, తర్వాత ఆపేశారన్నారు.  గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ118తో సాయిప్రియ కాలనీ సాలార్​జంగ్​కంచెలోని సమస్యలు తొలగిపోతాయనుకున్నామన్నారు.  నిర్మాణంలో ఉన్నవాటికి మాత్రమే జీఓ అమలవుతుందని స్పష్టం చేయగా కొందరు నిర్మాణాలు చేపట్టారన్నారు.  సీలింగ్​ల్యాండ్​లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధమని, గతంలో తహసీల్దార్లు కూల్చివేత చేపట్టగా బాధితులు అడ్డుకుని కోర్టును ఆశ్రయించారన్నారు.  కోర్టు కేసు ఉన్నవాటిని వదిలేసి, మిగతావి కూల్చివేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంటి నంబర్లు ఇస్తామంటే చందాలు వేసుకుని కొందరికి రూ.కోట్లు ముట్టజెప్పామని బాధితులు వాపోయారు. కాంగ్రెస్​ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 118 జీఓను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్​నేతలు, అప్పటి మంత్రుల ఓఎస్డీ లబ్ధి పొందారని ఆరోపించారు. దాదాపు 300 మంది బాధితులు ఉన్నారన్నారు.