న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి నికర లాభం (స్టాండలోన్) గత డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్ (క్యూ3)లో నాలుగు శాతం పెరిగి రూ.3,794 కోట్లుగా నమోదైంది. 2024 ఇదే క్వార్టర్‌లో రూ.3,659 కోట్ల లాభం వచ్చింది. కంపెనీ కార్యకలాపాల ఆదాయం 29 శాతం వృద్ధి చెంది రూ.49,891 కోట్లుగా నమోదైంది. గత డిసెంబరు క్వార్టర్‌లో రూ.38,752 కోట్లు వచ్చాయి. ఎగుమతుల ఆదాయం తగ్గడం వల్ల అంచనాల కంటే తక్కువ లాభం వచ్చింది. కొత్త కార్మిక చట్టాల కోసం రూ.594 కోట్లు కేటాయించడం కూడా లాభంపై ప్రభావం చూపింది.
జీఎస్టీ తగ్గింపు వల్ల దేశీయంగా చిన్న కార్ల మార్కెట్ పుంజుకుని రికార్డు స్థాయి అమ్మకాలు నమోదయ్యాయి. నికర లాభం రెండో క్వార్టర్ లో ఉన్న రూ.3,303 కోట్ల నుంచి 15 శాతం పెరిగి రూ.3,794 కోట్లకు చేరింది. ఆదాయం రెండో క్వార్టర్తో పోలిస్తే 18 శాతం పెరిగింది. బ్రెజా, గ్రాండ్ విటారా వంటి మోడళ్లకు భారీగా ఉండటంతో 5,64,669 కార్లను అమ్మింది.
గత ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 4,66,993 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తం ఎగుమతులతో కలిపి అమ్మకాలు 6,67,769 యూనిట్లకు చేరాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో కంపెనీ రికార్డు స్థాయి అమ్మకాలు సాధించింది. ఈ కాలంలో మొత్తం 17,46,504 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. మారుతీ సుజుకి తొమ్మిది నెలల ఆదాయం రూ.1,24,291 కోట్లు కాగా, నికర లాభం రూ.10,855 కోట్లుగా నమోదైంది.
