India vs New Zealand 4th T20I: పాపం.. బ్యాడ్ లక్.. శివం దూబేనే అలా ఔట్ కాకపోయి ఉంటే..

India vs New Zealand 4th T20I: పాపం.. బ్యాడ్ లక్.. శివం దూబేనే అలా ఔట్ కాకపోయి ఉంటే..

విశాఖపట్నం: టీ20ల్లో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు న్యూజిలాండ్‌‌‌‌ ఎట్టకేలకు బ్రేక్ వేసింది. భారీ ఛేజింగ్‌‌‌‌లో ఇండియా బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేసిన కివీస్ బుధవారం వైజాగ్‌లో జరిగిన నాలుగో టీ20లో కివీస్‌‌‌‌ 50 రన్స్‌‌‌‌ తేడాతో గెలిచింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఆధిక్యాన్ని 3–1కి తగ్గించింది. టాస్‌‌‌‌ ఓడిన న్యూజిలాండ్‌‌‌‌ 20 ఓవర్లలో 215/7 స్కోరు చేసింది.

టిమ్‌‌‌‌ సిఫర్ట్‌‌‌‌ (36 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 62), డెవాన్‌‌‌‌ కాన్వే (23 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 44), డారిల్ మిచెల్‌‌‌‌ (39 నాటౌట్‌‌‌‌) దంచారు. తర్వాత ఇండియా 18.4 ఓవర్లలో 165 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. శివమ్‌‌‌‌ దూబే (23 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 7 సిక్స్‌‌‌‌లతో 65), రింకూ సింగ్‌‌‌‌ (39) పోరాడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ శాంట్నర్‌‌‌‌ (3/26) మూడు వికెట్లతో దెబ్బకొట్టాడు.  సిఫర్ట్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య ఆఖరి, ఐదో మ్యాచ్‌‌‌‌ తిరువనంతపురంలో శనివారం జరుగుతుంది. 

ఓపెనర్లు అదుర్స్‌‌‌‌..
ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన కివీస్‌‌‌‌కు ఓపెనర్లు కాన్వే, సిఫర్ట్‌‌‌‌‌ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ (2/33) వేసిన తొలి ఓవర్‌‌‌‌లో మూడు ఫోర్లు కొట్టిన సిఫర్ట్‌‌‌‌‌.. తర్వాత హర్షిత్‌‌‌‌ రాణాకు 6, 4తో స్వాగతం పలికాడు. మూడో ఓవర్‌‌‌‌ను అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ 4 రన్స్‌‌‌‌తో కంట్రోల్‌‌‌‌ చేసినా.. ఐదో ఓవర్‌‌‌‌లో హర్షిత్‌‌‌‌ మళ్లీ 6, 4, 4తో 15 రన్స్‌‌‌‌ ఇచ్చుకున్నాడు.

బుమ్రా (1/38) వేసిన ఐదో  ఓవర్‌‌‌‌లో సిఫర్ట్‌‌‌‌‌ సిక్స్‌‌‌‌తో కివీస్‌‌‌‌ స్కోరు 50కి చేరింది. రవి బిష్ణోయ్‌‌‌‌ (1/49) వేసిన ఆరో ఓవర్‌‌‌‌లో కాన్వే 4, 4, 6తో స్కోరు 71/0కి పెరిగింది. ఫీల్డింగ్‌‌‌‌ విస్తరించిన తర్వాత కూడా ఈ ఇద్దరి జోరు తగ్గలేదు. 7వ ఓవర్‌‌‌‌లో కాన్వే సిక్స్‌‌‌‌ బాదితే.. తర్వాతి ఓవర్‌‌‌‌లో సిఫర్ట్‌‌‌‌‌ 4, 4 దంచాడు. ఈ క్రమంలో 25 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 9వ ఓవర్‌‌‌‌లో కాన్వేను రెండో బాల్‌‌‌‌కు కుల్దీప్‌‌‌‌ పెవిలియన్‌‌‌‌ చేర్చడంతో  తొలి వికెట్‌‌‌‌కు 100 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. రచిన్‌‌‌‌ (2)ను 10వ ఓవర్‌‌‌‌లో బుమ్రా దెబ్బకొట్టాడు.

ఈ దశలో ఇండియా బౌలర్లు  కాస్త పుంజుకున్నారు. గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌ (24) ధాటిగా ఆడినా  ఎక్కువసేపు వికెట్‌‌‌‌ కాపాడుకోలేదు. సిఫర్ట్‌‌‌‌‌ను అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌, వెంటనే ఫిలిప్స్‌‌‌‌ను కుల్దీప్‌‌‌‌ పెవిలియన్‌‌‌‌కు పంపారు. 15వ ఓవర్లో చాప్‌‌‌‌మన్‌‌‌‌ (9) ఫోర్‌‌‌‌, మిచెల్‌‌‌‌ సిక్స్‌‌‌‌తో బ్యాట్లు ఝుళిపించారు. కానీ తర్వాతి ఓవర్లోనే బిష్ణోయ్‌‌‌‌ దెబ్బకు చాప్‌‌‌‌మన్‌‌‌‌ వెనుదిరిగాడు. ఓ ఫోర్‌‌‌‌, సిక్స్‌‌‌‌ కొట్టిన శాంట్నర్‌‌‌‌ (11) ఆరు బాల్స్‌‌‌‌ తర్వాత రనౌటయ్యాడు. 4, 6తో జోరు చూపెట్టిన ఫోక్స్‌‌‌‌ (13) 18వ ఓవర్‌‌‌‌లో వెనుదిరిగాడు. కానీ 19వ ఓవర్‌‌‌‌లో 4, 6, 4 దంచిన మిచెల్‌‌‌‌.. ఆఖరి ఓవర్‌‌‌‌లో 6, 4 కొట్టాడు. చివరి రెండు ఓవర్లలో 33 రన్స్‌‌‌‌ రావడంతో కివీస్‌‌‌‌ స్కోరు రెండొందలు దాటింది. 

దూబే మినహా..
ఛేజింగ్‌లో ఇండియాకు తొలి బాల్‌‌‌‌కే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ (0)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ (8) రెండు ఓవర్లకే డగౌట్ చేరారు. హెన్రీ (1/24) వేసిన లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌ను షాట్‌‌‌‌ ఆడిన అభిషేక్‌‌‌‌ బ్యాక్‌‌‌‌వర్డ్‌‌‌‌ పాయింట్‌‌‌‌లో కాన్వే చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్‌‌‌‌లో సూర్య కుమార్‌‌‌‌ వెనుదిరిగాడు. 9/2 వద్ద వచ్చిన రింకూ సింగ్‌‌‌‌.. శాంసన్‌‌‌‌కు తోడయ్యాడు. మూడో ఓవర్లో శాంసన్‌‌‌‌ రెండు ఫోర్లు కొడితే.. నాలుగో ఓవర్‌‌‌‌లో రింకూ రెండు సిక్సర్లు బాదాడు. ఆ వెంటనే శాంసన్‌‌‌‌ 4, 6 రాబట్టడంతో పవర్‌‌‌‌ప్లేలో ఇండియా 53/2 స్కోరు చేసింది.

కానీ ఏడో ఓవర్‌‌‌‌లో శాంట్నర్‌‌‌‌.. శాంసన్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేయడంతో మూడో వికెట్‌‌‌‌కు 46 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఇక్కడి నుంచి ఇండియా వరుస విరామాల్లో హార్దిక్‌‌‌‌ పాండ్యా (2), రింకూ సింగ్‌‌‌‌ వికెట్లను కోల్పోవడంతో 82 రన్స్‌‌‌‌కే సగం జట్టు పెవిలియన్‌‌‌‌కు చేరింది. ఈ దశలో శివమ్‌‌‌‌ దూబే వీరవిహారం చేశాడు. భారీ షాట్లతో ఫోర్లు సిక్సర్లు కొడుతూ  కేవలం 15 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ కొట్టాడు. కానీ,రెండో ఎండ్‌‌‌‌లో సహకారం కరువైంది. ఇక, 15వ ఓవర్లో దురదృష్టవశాత్తూ అతను ఔట్ కావడంతో ఇండియా ఓటమి ఖాయమైంది. ఆ తర్వాత  హర్షిత్‌‌‌‌ రాణా (9), అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ (0), బుమ్రా (4), కుల్దీప్‌‌‌‌ (1) పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఇండియా పూర్తి ఓవర్లు కూడా ఆడలేక ఓడిపోయింది.

సంక్షిప్త స్కోర్లు:

  • న్యూజిలాండ్‌‌‌‌: 20 ఓవర్లలో 215/7 (సిఫర్ట్‌‌‌‌‌ 62, కాన్వే 44, మిచెల్‌‌‌‌ 39 నాటౌట్‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ 2/33).
  • ఇండియా: 18.4 ఓవర్లలో 165 ఆలౌట్‌‌‌‌ (దూబే 65, రింకూ సింగ్‌‌‌‌ 39, శాంట్నర్‌‌‌‌ 3/26).