అలంపూర్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడంతో పలు పార్టీలకు చెందిన నాయకులు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో అలంపూర్ మున్సిపాలిటీలోని 8వ వార్డు సంగమేశ్వర కాలనీవాసులు అభ్యర్థులకు వార్డు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, ప్రతిరోజు మిషన్ భగీరథ నీరు వచ్చేలా చూడాలని, ప్రతిరోజు చెత్త సేకరించాలని, కాలనీని శుభ్రంగా ఉంచాలని, వార్డులో బోరు వేయించాలని, తుంగభద్ర నది నీళ్లు ఇచ్చేందుకు పైప్ లైన్లు ఏర్పాటు చేయాలనే ఏడు డిమాండ్లతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇవి తమ ప్రధాన సమస్యలని, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వారికే మద్దుత ఇస్తామని స్పష్టం చేశారు.
