- హుస్నాబాద్ అభివృద్ధికి ఆయన పట్టుబట్టి నిధులు తెస్తున్నరు
- మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డులూ గెలవాలె
హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ రైతుల దశాబ్దాల కల అయిన గౌరవెల్లి ప్రాజెక్టు మంత్రి పొన్నం ప్రభాకర్తోనే పూర్తవుతుందని.. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన పట్టుబట్టి నిధులు తెస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం హుస్నాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రెండేండ్లలో జరిగిన ప్రతి క్యాబినెట్ మీటింగ్‌లోనూ పొన్నం గౌరవెల్లి జపమే చేస్తున్నరని, సీఎం రేవంత్‌రెడ్డిని, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఒప్పించి నిధులు సాధిస్తున్నరని పేర్కొన్నారు. 20 వార్డుల్లోనూ గెలిచి పొన్నంకు గిఫ్ట్ ఇవ్వాలని కోరారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో హుస్నాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. టికెట్ల కేటాయింపులో ఎలాంటి సిఫార్సులకు తావులేదని, కేవలం సర్వే రిపోర్టుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. హౌస్‌ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్, జిల్లా లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, ఏఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ చందు, నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు
హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఆకుల రజిత, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు వారు తెలిపారు.
