న్యూఢిల్లీ: ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ మరోసారి భారీ ఉద్యోగ కోతలు ప్రకటించింది. ఇది గత మూడు నెలల్లో రెండోసారి. ఈసారి సుమారు 16 వేల ఉద్యోగులను తీసేయడానికి రెడీ అయ్యింది. ఫైనాన్స్, హెచ్‌ఆర్, టెక్, మార్కెటింగ్, కార్పొరేట్ స్ట్రాటజీ వంటి విభాగాల్లో పనిచేసే వారిని తొలగించనుంది. 2023లో 27 వేల ఉద్యోగాలు తొలగించిన తర్వాత ఇది అతి పెద్ద కోత. కంపెనీ జనరేటివ్ ఏఐ ఆధారంగా కొంతమంది ఉద్యోగులను భర్తీ చేయాలని యోచిస్తోంది.
కరోనా మహమ్మారి సమయంలో అమెజాన్ భారీగా నియామకాలు చేపట్టింది. ఈ వర్క్‌ఫోర్స్‌ను నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తోంది. కిందటేడాది అక్టోబర్‌లో 14 వేల మంది ఉద్యోగులను తొలగించగా, ఆ పనులన్ని ఇప్పుడు పూర్తయ్యాయని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి తెలిపారు.
యూఎస్ సిబ్బందికి 90 రోజులు లోపల కొత్త ఉద్యోగం వెతికే అవకాశం, లేకపోతే సెవరెన్స్ పే, హెల్త్ ఇన్సూరెన్స్ లభిస్తుందన్నారు. ఏఐ వల్ల భవిష్యత్తులో వర్క్‌ఫోర్స్ తగ్గుతుందని అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ ముందే చెప్పారు. కంపెనీ ఆర్థికంగా బలంగా ఉంది. అక్టోబర్–డిసెంబర్, 2025 క్వార్టర్‌లో అమెజాన్ లాభాలు 40శాతం పెరిగి 21 బిలియన్ డాలర్లను, ఆదాయం 180 బిలియన్ డాలర్లను దాటాయి.
యూపీఎస్‌లో 30 వేల మంది
అమెరికన్ లాజిస్టిక్స్ కంపెనీ యూనైటెడ్ పార్సిల్ సర్వీసెస్ (యూపీఎస్) కూడా 30 వేలకు పైగా ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. అమెజాన్‌తో డెలివరీ భాగస్వామ్యం ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
కంపెనీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) బ్రియాన్ డైక్స్ మాట్లాడుతూ, అమెజాన్ షిప్‌మెంట్‌లు తగ్గడంతో 2.50 కోట్ల వర్క్ అవర్స్ తగ్గించాల్సి వస్తోందని, ఉద్యోగ కోతలు ప్రధానంగా అట్రిషన్ ద్వారా జరుగుతాయని వివరించారు. అంటే ఉద్యోగులు స్వచ్ఛందంగా విడిచిపెట్టడం, రిటైర్మెంట్ లేదా భర్తీ చేయకపోవడం. ఫుల్ టైమ్ డ్రైవర్లకు స్వచ్ఛంద ఎగ్జిట్ ప్రోగ్రామ్ అందించనున్నారు. 2026 మొదటి భాగంలో 24 ఫెసిలిటీలను కంపెనీ మూసివేయనుంది.
