- మరో ముగ్గురికి తీవ్రగాయాలు
రామాయంపేట, వెలుగు: ట్రాక్టర్ ఢీకొని భార్యాభర్తలు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. రామాయంపేట ఎస్ఐ బాలరాజ్ తెలిపిన ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన పూసల మంజుల (36), బాలరాజ్(40) దంపతులు తమ కూతురు అక్షిత, కొడుకు అభి, మరో యువతి పావనితో కలిసి హవేలీ ఘనపూర్ మండలం పాతూరులో జరిగే అంగడిలో వ్యాపారం చేసుకునేందుకు బుధవారం రామాయంపేట నుంచి ఆటోలో వెళ్తున్నారు. మెదక్ రహదారిపై అక్కన్నపేట శివారులో ఆటోను ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మంజుల స్పాట్ లో చనిపోగా.. బాలరాజ్ ను హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అక్షిత, అభి, పావనికి రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ చేసి.. మెరుగైన వైద్యానికి హైదరాబాద్ తరలించారు.
అభి కండీషన్ సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. ఆ సమయంలో మెదక్ అడిషనల్ఎస్పీ మహేందర్ రామాయంపేటకు అటుగా వెళ్తూ ప్రమాదాన్ని చూసి ఆగారు. ఏఎస్పీ గన్ మెన్ ప్రశాంత్, కారు డ్రైవర్ గోవర్ధన్ తో కలిసి బాధితులను అంబులెన్స్ లో ఎక్కించి ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.
